సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'నీట్' లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 01:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విద్యార్దులు ఆగ్రహం

- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

- ఎస్ ఎఫ్ ఐ జాతీయ సహాయ కార్యదర్శి సంజీవ్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన సుమారు వేలాది మంది విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు వి.చిన్నబాబు అధ్యక్షత వహించారు. ఈ సభలో ఎస్ఎఫ్ఐ ఆలిండియా సహాయ కార్యదర్శులు పి.ఎస్. సంజీవ్, ఎం. మమత, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షపై లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఆధారపడి ఉంటారని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో లీకేజీలు, అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థుల నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల ఆశలను నీట్ లీకేజీ ఘటనలు వమ్ము చేశాయని, కొందరి అక్రమాల వల్ల 25 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన కేంద్ర విద్యాశాఖ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. విద్యను కార్పొరేటీకరణ చేసే విధానాల వల్ల సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఎస్ఎఫ్ఐ ఎప్పటికీ ముందుండి ఉద్యమిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కార్యదర్శి డి రాము, జిల్లా కమిటి సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్