శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుమానంతోనే యాస్మిన్ హత్య

1 గంట క్రితం

press meet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 01:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి

  • పల్నాడు జిల్లా యువతి హత్య కేసుపై డిఎస్‌పి ప్రెస్‌మీట్‌

ప్రజాశక్తి-చిలకలూరిపేట: ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరికి దగ్గరవుతోందనే అనుమానంతో ఓ యువకుడు ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. శ్రుకవారం వెలుగు చూసిన ఘటనపై డీఎస్పీ ఎం. హనుమంతురావు శనివారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తె షేక్ హసీనా అలియాస్ యాస్మిన్ (23) బీటెక్ పూర్తి చేసి సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నిందితుడు జినుగు బాల సైదులు (25) బీటెక్ మధ్యలో ఆపేసి వ్యవసాయం చేస్తున్నాడు. వీరిరువురు హసీనాలు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.అయితే ఇటీవల హసీనా తనతో తక్కువగా మాట్లాడుతుండటంతో, ఆమె వేరే వ్యక్తికి దగ్గరవుతోందని, తనను కావాలనే దూరం పెడుతోందని సైదులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన హసీనాకు ఫోన్ చేసిన సైదులు ఆమెను కారంపూడికి రప్పించాడు. మాట్లాడుకుందామని నమ్మించి, అక్కడి నుంచి కారంపూడి-నకరికల్లు రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కాలువ పశ్చిమ కట్ట వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో హసీనాపై దాడి చేసి.. కడుపులో మూడుసార్లు బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో హసీనా అక్కడికక్కడే మృతి చెందింది.హత్య అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా చేసేందుకు సైదులు తన బైక్‌లోని పెట్రోల్‌ను ఖాళీ వాటర్ బాటిల్‌లో పట్టుకుని, మృతదేహంపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

మిస్సింగ్ కేసు విచారణలో వెలుగులోకి

కూతురు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కనిపించడం లేదని బాధితురాలి తండ్రి మస్తాన్ వలి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, ఎస్పీ జె.వి. సంతోష్, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతురావు ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆగస్టు 8న కారంపూడి పాత సినిమా హాల్ సెంటర్ (హోండా షోరూమ్) వద్ద నిందితుడు సైదులును అదుపులోకి తీసుకున్నారు. దీంతో మహిళ అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చారు. కేసు నంబర్ 214/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 103(1), 140(1), 238 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్, ఎస్‌ఐలు వి. సోమేశ్వరరావు, పి. హజరత్తయ్య, వారి సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్