- ‘సర్’తో రాజ్యాంగానికి పొంచి ఉన్న పెనుముప్పు
- విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల కమిషన్
- సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో పరకాల ప్రభాకర్
- బిజెపిని సమర్ధించడం *టిడిపి, వైసిపికి మరణ శాసనం : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : దేశంలో గత రెండేళ్లలో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక పరిశీలన (సర్) ద్వారా 13 కోట్ల మందిని తొలగించారని, వీరంతా వీధుల్లోకి వచ్చి తమ ప్రాథమిక ఓటు హక్కుకోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకు పౌర సమాజం, వివిధ ప్రజా సంఘాలు నడుం బిగించాలని ప్రముఖ ఆర్ధిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక బ్రాడీపేటలో సిపిఎం జిల్లా కార్యాలయంలో ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, విశ్వసనీయత- పౌరసమాజం కర్తవ్యం’ అనే అంశంపై పరకాల ప్రభాకర్ స్మారకోపన్యాసం చేశారు. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభకు సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పరకాల మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం,భారత రాజ్యాంగం, లౌకికవాదాలపై దాడి జరుగుతున్న ఈ తరుణంలో... ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్య శక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే నాయకులు కరువయ్యారని, ఒకవేళ సీతారాం జీవించి ఉంటే తప్పకుండా ఆ పాత్రను పోషించేవారని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగానికి పెను ముప్పు పొంచి ఉందని, సర్ పేరుతో సంచార జాతులు, వలస కార్మికులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు,మహిళల ఓట్లు తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి బలహీనులందరి ఓట్లు తొలగించడం ద్వారా వారి పౌరసత్వాన్ని లేకుండా చేస్తారని ప్రభాకర్ అన్నారు. క్రమంగా ఇటువంటి ఎస్‌ఐఆర్‌ల ద్వారా సవర్ణ హిందువులు మాత్రమే ఓటర్లుగా మిగిలే పరిస్థితి తీసుకొస్తారని హెచ్చరించారు. అంటే ఆనాటికి ఏ రాజకీయ పార్టీ అయినా వారిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని పని చేసే స్థితి ఏర్పడుతుందన్నారు. తద్వారా మతతత్వం మరింత పెచ్చరిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితాల పరిశీలన తరువాత 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, వీరంతా భారత ఓటర్లుగా ఉండే అర్హత లేకపోతే 2024 ఎన్నికల్లో వీరి ఓట్లుతో ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయినట్టేనని విమర్శించారు. 2024 మే నెలలో ఎపి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 3500 పోలింగ్ బూత్‌లలో 17.25 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకూ ప్రజలు పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడి ఓటు వేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వారిని ఆధారాలతో చూపితే తాను వారికి పాద పూజ చేస్తానని తెలిపారు. పోలింగ్ పూర్తయిన పది రోజులకు పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసేదిగా ఉందన్నారు. సర్ ప్రక్రియలో ఢిల్లీలోని చాందీనీచౌక్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 33లో మొత్తం 909 ఓటర్లు ఉండగా 908 మందిని తొలగించారని కేవలం ఒక్క ఓటును మిగిల్చారని ఆరోపించారు. 2023 హైదరాబాద్ మలక్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో 1,32,024 ఓట్లు పోలవ్వగా సర్ ద్వారా 1,47,774 ఓట్లు, యాకుత్‌పుర నియోజకవర్గంలో 1,43,434 ఓట్లు పోలవ్వగా 1,54,974 ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. తొలగించిన ఓటర్లను వీధుల్లోకి తీసుకువచ్చి ప్రజాపోరాటాలు రూపొందించాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా ప్రాంతీయ పార్టీలకు తీరని నష్టం వాటిల్లుతోందని పలు రాష్ట్రాల అనుభవాలు రుజువు చేస్తున్నాయని అన్నారు. దేశంలో గత 12 ఏళ్లుగా రాజ్యాంగబద్ధమైన విలువలపై దాడులు జరుగుతూ, ఒక్కొక్క వ్యవస్థ క్రమంగా ధ్వంసమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలు ప్రజల్లో తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయని తెలిపారు. ఈ పరిణామాలపై దేశ యువత తిరుగుబాటు చేస్తోందని, అందులో భాగమే 'జెన్-జీ' ఉద్యమం వచ్చిందన్నారు. సర్ ప్రక్రియతో భారీగా ఓట్లు తొలగిస్తున్నా కేంద్రాన్ని గుడ్డిగా సమర్ధిస్తున్న టిడిపి, వైసిపిలు తమ మరణ శాసనం తామే రాసుకుంటున్నాయని హెచ్చరించారు. జెన్ జీ ఉద్యమానికి భయపడి మోడీ, అమిత్ షా పార్లమెంటు హాలులోకి అడుగు పెట్టలేకపోయారని, అయినా, టిడిపి, వైసిపి తీరులో మార్పురావడం లేదన్నారు. సర్ పేరుతో ఓటు హక్కులేకుండా చేయడం ద్వారా వారు పౌరసత్వం కూడా కోల్పోతారని, అప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు పొందే హక్కును కోల్పోతారన్నారు. కార్పొరేట్ శక్తులకు తలొగ్గిన మోడీ ప్రభుత్వం.. పేదల ఓట్లను తొలగించడం ద్వారా తమను ఎవరూ ప్రశ్నించకుండా, ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేకుండా తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ తదితరులు ప్రసంగించారు.








కామెంట్‌లు (0)