- సమస్యలు పరిష్కరించమంటే జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు
- పారా మెడికల్ విద్యార్ధులపై అమానుష ప్రవర్తన
ప్రజాశక్తి - తిరుపతి సిటీ : సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న పారామెడికల్ విద్యార్థులపై తిరుపతి పోలీసులు జులుం ప్రదర్శించారు. వెంటపడి తరిమారు. విద్యార్థినులని కూడా చూడకుండా నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని లాకెళ్లారు. శనివారం తిరుపతిలో చోటుచేసుకున్న ఈ సంఘటనలు నగర ప్రజానీకాన్ని దిగ్ర్భాంతికి గురిచేశాయి. జుట్టుపట్టుకుని లాకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి పోలీసుల ఈ అమానుష ప్రవర్తనను పలువురు ఖండించారు. 15వేల రూపాయలు స్టైపండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోనే పారా మెడికల్ విద్యార్థులు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారం రోజులుగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం రుయా హాస్పిటల్ నుంచి అలిపిరి వరకూ శాంతియుత ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కేవలం వంద మీటర్లు వరకూ సాగిన ర్యాలీపై ఒక్కసారిగా పోలీసులు విరుచుకుపడ్డారు. అలిపిరి వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించి ర్యాలీని చెదరగొట్టారు. శాంతియుత పద్ధతిలో తమ కష్టాలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామని విద్యార్థులు నచ్చజెప్పినా పోలీసులు వినలేదు. దొరికిన వారిని దొరికినట్లుగా జుట్టు పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ విద్యార్థిని మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును విద్యార్థులు ప్రతిఘటించినా పట్టించుకోకుండా అరెస్టుల పర్వం కొనసాగించారు.రెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవిత్ర, అక్బర్, నాయకులు సునీత, అనిత, లతీఫ్, వినోద్ తదితరులు ఉన్నారు. విద్యార్థులపై పోలీసుల అమానుష కాండను సిపిఎం రాష్ట్ర, జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి. తిరుపతి ఎంపి డాక్టర్ మద్దిల గురుమూర్తి కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు.








కామెంట్‌లు (0)