సిపిఎం నేతలు బివి రాఘవులు, వి శ్రీనివాసరావు, జాన్ వేస్లీ నివాళి
భౌతికకాయాన్ని మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి అప్పగింత
పి మధుకు ఫోన్‌లో ప్రకాశ్‌కరత్ పరామర్శ
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : మహిళా ఉద్యమ నేత సుమతి (80) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిపిఎం సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు సతీమణి అయిన ఆమెకు కుమార్తె డాక్టర్ ప్రతిభ ఉన్నారు. వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సుమతి భౌతికకాయాన్ని మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు కుటుంబసభ్యులు అప్పగించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సిపిఎం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, జాన్ వెస్లీ, ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు తదితరులు సుమతి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ పాలిటెక్నిక్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుమతి... ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. చనిపోయే నాటికి ఆమె అనేక కథలు, సామాజిక స్పృహ కలిగిన కథనాలు రచించారని గుర్తు చేశారు. ఉద్యోగం చేస్తూనే సిపిఎం బలోపేతానికి కోసం కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే పింఛనులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.50 వేలు, తెలంగాణకు రూ.50 వేలు చొప్పున ప్రతి నెల విరాళంగా ఇస్తున్నారంటే ఆమె ఉదారత్వం తెలుస్తోందన్నారు. ఉద్యోగ సమయంలో జనవిజ్ఞాన వేదికలో పనిచేస్తూ మూఢనమ్మకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారని, శాస్త్రీయ భావజాలం పెంపుదల కోసం ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఐద్వాలో చేరి మహిళా అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మధు కుటుంబం మొత్తం సిపిఎంలో ఉంటూ కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేయడం అభినందనీయన్నారు. సమసమాజ నిర్మాణానికి కృషి చేయడమే సుమతికి నిజమైన నివాళని పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, నవతెలంగాణ సిజిఎం ప్రభాకర్, వ్యకాస తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగయ్య, వెంకట్రాములు, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు రాంమోహన్, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆశాలత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సుధాభాస్కర్, మహబూబ్‌నగర్ జిల్లా సిపిఎం, ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించారు. కాగా పి మధుకి సిపిఎం పూర్వ పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ఫోన్ చేసి పరామర్శించారు.
మధు సతీమణి సుమతి బౌతికయం వద్ద నివాళి అర్పిస్తున్న తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యులు
ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చిత్రంలో వై వి తదితరులు
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
సుమతి మృతి పట్ల సిపిఎం, ప్రజా సంఘాల సంతాపం
మహిళా ఉద్యమ నేత, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు సతీమణి సుమతి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. ఆమె మృతి పట్ల సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవితో పాటు ఐద్వా, రైతు సంఘం, ఎపి కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, యుటిఎఫ్, కెవిపిఎస్ తదితర ప్రజా సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో ప్రగాఢ సంతాపం, జోహార్లు తెలిపారు. పి మధుతోపాటు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన సుమతి అభ్యుదయ, ప్రగతిశీల భావాలతో జీవించారని సంతాప ప్రకటనల్లో పేర్కొన్నారు. కాటూరు గ్రామంలో జన్మించిన ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం మహిళా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అంకితమయ్యారని తెలిపారు. ఐద్వా నాయకురాలిగా మహిళల హక్కులు, అభ్యున్నతి కోసం కృషి చేశారని, ‘చైతన్య మానవి’ పత్రిక నిర్వహణలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ‘పిల్లల సంరక్షణ’, పిల్లల అలవాట్లు’ పుస్తకాలను అనువాదం చేశారు. కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేయడంతోపాటు సమకాలీన అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజల్లో అభ్యుదయ భావాలను పెంపొందించేందుకు కృషి చేశారని నాయకులు తెలిపారు. నిబద్ధత, అంకితభావంతో చివరి వరకు ప్రజా ఉద్యమాలతో మమేకమై ఉన్నారని పేర్కొన్నారు. పి మధు పూర్తికాలం కమ్యూనిస్టు కార్యకర్తగా కొనసాగేందుకు సుమతి అందించిన సహకారం ఆదర్శనీయమని తెలిపారు. మోటూరు ఉదయం ట్రస్టు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పనిచేశారని గుర్తుచేశారు. సుమతి కుటుంబ సభ్యులు ఆమె పార్థీవదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దానం చేశారని, ఇది ఆమె ప్రగతిశీల, శాస్త్రీయ భావాలకు కొనసాగింపుగా నిలిచిందని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. సంతాపం ప్రకటించిన వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు బి బలరాం, ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రమాదేవి, కె లోకనాథం, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కారద్యర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఉన్నారు. సుమతి మృతి పట్ల ఎంబివికె నిర్వహణ కమిటీ సభ్యులు బిఆర్ తులసీరావు, పి మురళీకృష్ణ, యువి రామరాజు, కె స్వరూపరాణి, టి క్రాంతి కిరణ్, పి విజయ, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యులు జి నారాయణ, పి ఐజాక్ న్యూటన్ సంతాపం వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)