బెంగళూరు : మంత్రి రామలింగా రెడ్డి వ్యవహారం నుండి గట్టెక్కారనుకున్న తరుణంలోనే .. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మరో అసంతృప్తి సెగ ఎదురైంది. శాఖల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న ఇద్దరు నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల కోసం ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. కృష్ణబేరె గౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. అయితే, ఆ శాఖలోని బెంగళూరు అభివృద్ధి అథారిటీ (బిడిఎ), బెంగళూరు మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (బిఎంఆర్ డిఎ) వంటి కీలక విభాగాలను మాత్రం సిఎం తన వద్దే ఉంచుకున్నారు. దీనిపై కృష్ణ బేరె అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ సమస్య పూర్తిగా పరిష్కారమైన తర్వాతే ఆ శాఖ బాధ్యతలు చేపడతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆయన భేటీ కానున్నారు. గౌడతో పాటు ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.
ఇటీవల నగరాభివృద్ధి శాఖను కేటాయించడంపై రామలింగారెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నగరాభివృద్ధి శాఖ పైనే కృష్ణ బేరె అసంతృప్తిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోమవారం మాజీ మంత్రులు జగదీష్ షెట్టర్, డి.వి. సదానంద గౌడలతో సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సీనియర్ నాయకులతో చర్చలు జరిపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కు మరో అసంతృప్తి సెగ
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)