విజయవాడ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,080 కిలోమీటర్లు, బాపట్లకు 1,150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని హెచ్చరించింది. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.








కామెంట్లు (0)