గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.. 150 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను యానాం–నరసాపురం మధ్య తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు తీరాన్ని దాటే ప్రక్రియ కొనసాగింది. ఈ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచగా, గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల తర్వాత తుపాను తీవ్ర తుపానుగా బలహీనపడింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.
తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఆరు గంటల్లో తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాకినాడ సమీపంలో కొట్టుకుపోయిన కార్గో నౌక ....
తుపాను ప్రభావంతో కాకినాడ సమీపంలో కార్గో నౌక కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన ‘సిగ్మా పేరల్’ నౌక ఇంజిన్ విఫలం కావడంతో సముద్రంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. సుమారు 130 నాటికల్ మైళ్ల దూరం కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
తుపాను సహాయక చర్యలపై సిఎం సమీక్ష
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రహదారులపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, తుపాను ప్రభావం తగ్గిన తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.
తెలంగాణలోనూ వర్షాలు ....
అర్నబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 30, 31 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని తాజ్‌పూర్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తుండగా, సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి.








కామెంట్‌లు (0)