కడపలో 39కి 23 జడ్‌పిటిసిలు ఏకగ్రీవం
పులివెందుల నియోజకవర్గంలో 65 ఎంపిటిసిలకు 64 ఏకగ్రీవం
ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ర్టవ్యాప్తంగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో పలు స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో 65 ఎంపిటిసి స్థానాలకు 64 ఏకగ్రీవమయ్యాయి. పలు జిల్లాల్లో ప్రత్యర్థి అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బరిలో మిగిలిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి, వారికి రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కడప జిల్లాలోని 39 జెడ్‌పిటిసి స్థానాలకు 23 స్థానాలు ఏకగ్రీవమయ్యియి. టిడిపి 19 స్థానాలు, బిజెపి మూడు స్థానాలు, జనసేన ఒక చోట ఏకగ్రీవం చేసుకున్నాయి. బిజెపి తరపున జమ్మలమడుగు స్థానానికి సి.రాజేష్ రెడ్డి, జనసేన తరుపున కమలాపురం స్థానాన్ని మోటిమేర రాముడు ఏకగ్రీవమయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని 65 ఎంపిటిసి స్థానాలకు 64 ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ ఏడు జెడ్‌పిటిసి స్థానాలకు మూడు ఏకగ్రీవమయ్యాయి. వేంపల్లి మండలం అల్లిరెడ్డిపల్లె ఎంపిటిసి స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది.
అనంతపురం జిల్లాలో 31 జెడ్‌పిటిసి స్థానాలకు 28 స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని మూడు స్థానాలు ఏకగీవ్రమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 96 మంది బరిలో నిలిచారు. గుత్తి మండలంలో 11 ఎంపిటిసి స్థానాలకు 11 ఏకగ్రీవమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 32 జెడ్‌పిటిసి స్థానాలకు 141 మంది పోటీపడుతున్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 28 జెడ్‌పిటిసి స్థానాలకు 18 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పదిలో నాలుగు స్థానాల్లో సిపిఎం అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వైసిపి కేవలం ఏడు స్థానాల్లోనే పోటీ పడుతుంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 27 జెడ్‌పిటిసి స్థానాలకు గాను మూడు స్థానాలను ఏకగ్రీవంగా టిడిపి కైవసం చేసుకుంది. 24 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో రాజాం మండలంలో రెండు, రేగిడిలో నాలుగు ఎంపిటిసి స్థానాలు, తెర్లాం మండలంలో రెండు, వంగర మండలంలో ఒక స్థానంలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. జిల్లాలోని మొత్తం 27 జెడ్‌పిటిసి స్థానాలకు 103 మంది బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో 30జెడ్‌పిటిసి స్థానాల్లో 95మంది బరిలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాల్లో పోటీ నెలకొంది.
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెద్దగుమ్మలూరు ప్రాదేశికం నుంచి టిడిపి ఎంపిటిసి అభ్యర్థిగా పోటీలో ఉన్న మేజర్ల అనిల్ వర్మ ఏకగ్రీవమయ్యారు. ఏలూరు జిల్లా పెదవేగి జెడ్‌పిటిసిగా ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలంలో 19 ఎంపిటిసి స్థానాలకు పది స్థానాల్లో టిడిపి కూటమి కైవసం చేసుకుంది.

రెండు ఎంపిటిసి స్థానాలు సిపిఎం కైవసం
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లె ఎంపిటిసిగా సిపిఎం అభ్యర్థి సి.చాముండేశ్వరి, మార్కాపురం జిల్లా కొమరోలు-1 ఎంపిటిసి స్థానానికి సిపిఎం అభ్యర్థి నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సిపిఎం అభ్యర్థిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రకటన
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి ఎంపిటిసి అభ్యర్థిగా సిపిఎం తరఫున ఎం. కాంత నామినేషన్ వేశారు. నామినేషన్ రోజు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని చెప్పిన అధికారులు, చివరికి ఇండిపెండెంట్‌గా ప్రకటించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, సిపిఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే ఎన్నిక నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్ గంగరాజు డిమాండ్ చేశారు.
మార్కాపురంలో బి. ఫారాలు చించివేసిన టిడిపి నేతలు
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని 15 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి కొద్ది నిమిషాల ముందు టిడిపి నేతలు కాకర్ల శ్రీనివాసులు, జవ్వాజి రామాంజులరెడ్డి ఎంపిడిఒ కార్యాలయంలోకి వెళ్లి వైసిపి పోటీ చేసిన తొమ్మిది ఎంపిటిసి స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల బి.ఫారాలను చించివేశారు. వైసిపి నేతల ఫిర్యాదు మేరకు బీ.ఫారాలను ఎంపిడిఒ కార్యాలయానికి మార్కాపురం ఆర్‌డిఒ చేరుకుని పరిశీలించారు. డిఎస్‌పి నిమ్మగడ్డ సత్యనారాయణ, సిఐ అల్తాఫ్ హుస్సేన్, తహశీల్దార్ కే చిరంజీవి తదితరులు విచారణ చేపట్టారు. బి.ఫారాలను చించివేసిన ఇద్దరు టిడిపి నేతలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.







కామెంట్‌లు (0)