అమరావతి : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కు ఎపి సిఎం చంద్రబాబు లేఖ రాశారు. అర్నబ్ తుపానుతో రాష్ట్రంలో భారీగా పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే పంపించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను తీవ్రతతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. సహాయక చర్యల కోసం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రాథమిక అంచనా ప్రకారం .... 180 ఇళ్లు దెబ్బతినగా, రహదారులపై 220 కి పైగా చెట్లు కూలిపోయాయని లేఖలో పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని చంద్రబాబు లేఖలో వివరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. తుపాను నష్టంపై సమగ్ర అంచనా పూర్తయిన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని, నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నిరంతరం సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.








కామెంట్‌లు (0)