ప్యోంగ్యాంగ్ : సైనిక విస్తరణలో భాగంగానే జపాన్ దాడులు చేపట్టిందని ఉత్తర కొరియా మీడియా కెసిఎన్‌ఎ మంగళవారం వెల్లడించింది. జపాన్ సైనిక చర్యలు ఊహాజనితం కాదని, వాస్తవమని పేర్కొంది. నౌకలపై దాడులు చేయగల మానవరహిత జలాంతర్గాములను అభివృద్ధి చేయడానికి జపాన్ ప్రణాళికలు రచిస్తోందని తెలిపింది. ఈ నౌకలు టార్పెడోలు, నావికా మైన్లను మోసుకెళ్లగలవని, పొరుగు దేశాల తీరప్రాంతాల సమీపంలో మోహరించి సంఘర్షణ సమయంలో శత్రు నౌకలపై ముందస్తు దాడులు చేయగలవని పేర్కొంది. రక్షణ-ఆధారిత విధానం అనే సిద్ధాంతాన్ని విడిచిపెట్టి, జపాన్ తన సైన్యాన్ని "పూర్తిగా దాడి చేసే, దురాక్రమణ శక్తిగా" మారుస్తోందని ఆరోపించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సుదూర శ్రేణి క్షిపణులను అధికంగా ఉత్పత్తి చేయడం, 3,000 కిలోమీటర్ల (1,864 మైళ్లు) పరిధి కలిగిన కొత్త బాలిస్టిక్ క్షిపణిని రూపొందించడం, ఆధునీకరించిన నౌకా-విధ్వంసక క్షిపణులు, హైపర్సోనిక్ గ్లైడ్ ఆయుధాలను మోహరించడం, అలాగే అమెరికాకు చెందిన 'టోమాహాక్' క్షిపణులతో సహా విదేశీ తయారీ క్షిపణులను సమకూర్చుకోవడం వంటి యత్నాలను జపాన్ చేపడుతోందని ఉత్తర కొరియా మీడియా ప్రస్తావించింది.
నూతన 5,000-టన్నుల డిస్ట్రాయర్ 'కాంగ్ కోన్' నౌక నుండి ఒక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాన్ని, ఆయుధ వ్యవస్థల పరీక్షలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారని మీడియా నివేదించింది. నేవీ పోరాట సామర్థ్యాలను విస్తరించాలని పిలుపునిచ్చారని, రెండు నెలల్లోగా ఈ నౌకను సేవలోకి ప్రవేశపెట్టాలని ఆదేశించినట్లు తెలిపింది.








కామెంట్‌లు (0)