భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కెరీర్‌లో 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు చేరువైన సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టీ20లో బరిలోకి దిగితే ఆయన ఈ అరుదైన మైలురాయిని అందుకుంటారు.ఈ సందర్భంగా బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో అక్షర్ పటేల్ కొన్ని ముఖ్య విషయాలు పంచుకున్నారు.
ఇదే ఇంగ్లండ్ సిరీస్‌లోని రెండో టీ20లో 100 వికెట్ల మైలురాయిని అందుకోగా, ఇప్పుడు 100వ మ్యాచ్ ఆడబోతుండటం ఎంతో ప్రత్యేకంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.కెరీర్ ప్రారంభంలో 100 మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదని, భారత్ తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం ఒక క్రికెటర్‌గా కల నిజమవడమేనని అన్నారు. ఈ ఘనతలో సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్నారు. 2015లో అరంగేట్రం చేసినా మొదటి ఐదారేళ్లలో కేవలం 15-16 మ్యాచ్‌లే ఆడానని, అయితే 2021 నుంచి వరుస అవకాశాలు రావడం, గత రెండు ప్రపంచకప్‌ల్లో ఆడటం కెరీర్‌లో మరపురాని జ్ఞాపకాలుగా నిలిచాయని పేర్కొన్నారు. మైలురాళ్ల కంటే ప్రతిరోజూ ఆటను మెరుగుపరుచుకోవడానికే ప్రాధాన్యమిస్తానని, తప్పుల నుంచి త్వరగా నేర్చుకోవడమే అనుభవంతో తాను తెలుసుకున్న సూత్రమని అక్షర్ పటేల్ వివరించారు.








కామెంట్‌లు (0)