గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కులవివక్ష లేని సమాజం కోసం కదిలిరండి

2 గంటల క్రితం

ramadevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 06:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‘సామాజిక శంఖారావం’ సదస్సులో రాష్ట్ర నాయకుల పిలుపు

ప్రజాశక్తి-అమలాపురం : కులవివక్ష లేని సమాజం కోసం కదిలిరవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అమలాపురంలో ‘సామాజిక శంఖారావం’ జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో ‘సామాజిక శంఖారావం’ కరపత్రాన్ని డి.రమాదేవి, బి.బలరాం,దడల సుబ్బారావు విడుదల చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా సమాజంలో కుల వివక్ష, అంటరానితనం రూపాంతరం చెంది నేటికీ కొనసాగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు కులవివక్ష లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. నేడు పల్లెల్లో దళిత వాడలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అంటరానితనం వేర్వేరు రూపాల్లో కోరలు చాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల సమస్యలను పరిశీలించడానికి ప్రజా సంఘాల కార్యకర్తలు అధ్యయన యాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. దళిత సమస్య అనేది కేవలం ఒక కులానికి సంబంధించినది కాదని, అది ఒక సామాజిక సమస్య అని స్పష్టం చేస్తూ, సామాజిక న్యాయాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సామాజిక శంఖారావం ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దళితుల స్మశాన వాటికల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేసి భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని, మతం పేరుతో జరుగుతున్న వేధింపులను, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను, అపహాస్యపు మాటలను అరికట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యాన్ని వీడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ పెంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్స్‌ను పునరుద్ధరించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు తగిన రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ కలుపుకొని ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని, ఈ నెలలో జరగబోయే సామాజిక శంఖారావం బృందాల యాత్రలకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఐ.మంగాదేవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, కార్యదర్శి ఎన్.బలరాం, టి.నాగవరలక్ష్మి, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసిరావు, నిమ్మకాయల వెంకటేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి.దైవకృప, సుశీల, కౌలు రైతు సంఘం నాయకులు బుంగ సత్యనారాయణ, గోపాలం, పాము బాలయ్య, అంగన్‌వాడీ జిల్లా కోశాధికారి పి. అమూల్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్