గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్‌ ఆర్డర్‌ ‌చెల్లదు

30 జూన్, 2026

US Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

జన్మతః పౌరసత్వాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు

​వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని రద్దు ఉత్తర్వును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమెరికాలో జన్మించిన ఎవరికైనా ‘పుట్టుకతో వచ్చే పౌరసత్వం’ హక్కును సుప్రీంకోర్టు సమర్థించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అత్యవసర ఉత్తర్వు) జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ట్రంప్‌ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ‌సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కులు యథావిధిగా కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తేల్చిచెప్పింది. అమెరికా అంతర్యుద్ధం అనంతరం ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాష్యాన్ని, ఇటీవలి సమాఖ్య చట్టాలను ఆధారంగా చేసుకుని, పరిమిత మినహాయింపులు మినహా దేశంలో జన్మించిన వారికి బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేయలేమని, ప్రతి ఒక్కరూ పౌరులేనని న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. ట్రంప్‌ ‌రెండో పర్యాయం అధ్యక్ష భాద్యతలు చేపట్టిన అనంతరం తొలి సంతకం జన్మతః పౌరసత్వం రద్దుపై చేశారు. ప్రపంచ దేశాలపై అత్యవసర అధికారాల చట్టం కింద ఏకపక్షంగా విధించిన సుంకాలను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. అనంతరం ట్రంప్‌ ‌నాయముర్తులపై విరుచుకుపడ్డారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు సిగ్గులేదని, వారికి దేశభక్తి లేదని విమర్శించారు. ఈ తీర్పుకు ముందు తన సొంత సోషల్‌ ‌మీడియా ట్రూత్‌ ‌సోషల్‌ వేదికపై "మూర్ఖులైన న్యాయమూర్తులు" అని అభివర్ణించారు.

ఇతర దేశాల పిల్లలకు పౌరసత్వం సహించను అంటూ పోస్ట్‌‌లో చెప్పుకొచ్చారు. మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వస్తే ఏటా అమెరికాలో జన్మించే పావు మిలియన్‌కు పైగా శిశువులు ప్రభావితమయ్యేవారు. ట్రంప్ తన ప్రసంగాలు, చర్యల్లో ఎక్కువగా అక్రమ వలసలపైనే దృష్టి సారించినప్పటికీ, జన్మతః పౌరసత్వ పరిమితులు చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి కూడా వర్తించేవి. విద్యార్థులు, గ్రీన్ కార్డు (శాశ్వత నివాస హోదా) దరఖాస్తుదారులు సైతం వీటి పరిధిలోకి రానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్