నిర్బంధంలో 164 మంది చిన్నారులు
యునిసెఫ్ వెల్లడి
జెనీవా : చిన్నారులపై ఇజ్రాయిల్ దాష్టికాలను యుఎస్ భద్రతామండలి తాజాగా బయటపెట్టింది. 2024 జనవరి నుండి ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ (ఆక్రమిత తూర్పు జెరూసలేంతో సహా) ప్రాంతంలో కనీసం 174 మంది పాలస్తీనా పిల్లలు మరణించారని యునిసెఫ్ వెల్లడించింది. అంటే వారానికి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు మరణించారని పేర్కొంది. ఇదే సమయంలో 1500మందికి పైగా చిన్నారులు గాయాలపాలయ్యారని, వారిలో సగం మంది తూటాల కారణంగా గాయపడ్డారని యుఎన్ భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) లో యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనన్ సులేమాన్ పేర్కొన్నారు.
చిన్నారులు పారిపోతున్న సమయంతో కూడా వారిపై కాల్పులు జరిపిన ఘటనలను యుఎన్ నమోదు చేసిందన్నారు. పిల్లలపైకాల్పులు, దాడులు, కత్తిపోట్లు, పెప్పర్ స్ప్రే జరిగాయని, అలాగే వారి నివాసాలు, జీవనోపాధి, నీటి మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయని తెలిపారు. ఇజ్రాయిల్ జైలు సర్వీసు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్‌కు చెందిన సుమారు 355మంది పాలస్తీనియా చిన్నారులు ఇజ్రాయిల్ సైనిక నిర్బంధంలో ఉన్నారని సులేమాన్ పేర్కొన్నారు. ఇది గత ఎనిమిదేళ్లలో అత్యధిక సంఖ్య అని అన్నారు. వారిలో సుమారు సగం మంది అంటే 164మంది పిల్లలు ఎటువంటి అభియోగాలు లేదా విచారణ లేకుండా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిప్రాంతంలోని చిన్నారులందరికీ ఉన్నట్లే వెస్ట్‌బ్యాంక్‌లోని చిన్నారులకు కూడా జీవించే, విద్యనభ్యసించే, రక్షణ పొందే, హింస, భయాలకు అతీతమైన భవిష్యత్తును ఊహించుకునే హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)