బుధవారం రాత్రి విశాఖ–గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది గోపాల్‌పూర్‌కు 150 కి.మీ., కళింగపట్నానికి 100 కి.మీ., ఒడిశాలోని పూరీకి 220 కి.మీ., విశాఖపట్నానికి 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
22 గంటల్లో 78 మి.మీ. సగటు వర్షపాతం ....
విశాఖపట్నం జిల్లాలో గత 22 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. 22వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు జిల్లాలో సగటున 78.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వ్యవధిలో అత్యధికంగా భీమునిపట్నంలో 86.2 మి.మీ. వర్షం కురిసింది. మహారాణిపేటలో 83.6 మి.మీ., విశాఖపట్నం రూరల్, గోపాలపట్నంలో చెరో 82.2 మి.మీ., ఆనందపురంలో 81.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదగంట్యాడలో 77.0 మి.మీ., సీతమ్మధారలో 75.8 మి.మీ., ములగాడలో 74.6 మి.మీ., పద్మనాభంలో 73.0 మి.మీ., గాజువాకలో 71.2 మి.మీ., పెందుర్తిలో 70.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాజా వర్షపాతంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ 70 మి.మీ.కు పైగా వర్షం నమోదు కావడం గమనార్హం.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగుల కింద ప్రజలు నిలబడరాదని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.








కామెంట్‌లు (0)