బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమానవతకు ముప్పు

1 గంట క్రితం

medicines.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 05:49 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రాణాలను రక్ష‍ించాల్సిన ఔషధాలను కల్తీ చేయడం రోగుల ఊపిరి తీసేయడమే! గ్యాంబియా, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాల్లో పిల్లల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన నాసిరకం దగ్గు మందే కారణమంటూ అంతర్జాతీయ వివాదాలు తలెత్తినా... రెండేళ్ల క్రితం దేశ రాజధానిలో నకిలీ మందుల దందా వెలుగుచూసినా... నేటికీ మందుల మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతూనే ఉందని కర్ణాటకలో వెలుగుచూసినా తాజా ఘటన మరోసారి నిరూపించింది. దక్ష‍ిణ బెంగళూరు జిల్లా బిడదీలోని ఫామ్‌హౌస్‌పై కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌.డి.ఎ) డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, పోలీసులు గత నెలలో సంయుక్తంగా జరిపిన దాడులు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఎటువంటి లైసెన్స్‌లేని రీప్యాకింగ్‌, రీ లేబులింగ్‌ యూనిట్‌లో రూ.5 కోట్ల విలువ చేసే నకిలీ, గడువు ముగిసిన కేన్సర్‌ మందులు, ఐసియులో వినియోగించే ఇంజక్ష‍న్లలో మందులను ఫిల్లింగ్‌ చేసే యంత్రాలు, నకిలీ ప్యాకేజీ మెటీరియల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా తయారుచేసిన ప్రాణాంతకాలను బెంగళూరులోని ఓ ఫార్మసీ కేంద్రంగా కర్ణాటక రాజధాని సహా ఆ రాష్ట్రంలోని 90కి పైగా ఆసుపత్రులకు, క్లినిక్‌లకు సరఫరా చేశారన్న వార్తలు ఆందోళనకరం. హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో గడువు ముగిసిన, నాణ్యత లేని మందులను అతి తక్కువ ధరకు సేకరించి, కొత్త వయల్స్‌లో నింపి, ఫైజర్‌ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుల్ వేసి, ఎక్స్‌పైరీ డేట్‌ను మార్చేసి, మార్కెట్ ధర కంటే అతి తక్కువకు అమ్మేవారు. ఇలా 2025 నుంచి ఇప్పటివరకూ సుమారు రూ.12 కోట్ల విలువైనవి విక్రయించారన్న సిట్‌ అంచనా ఈ ముఠా దుర్మార్గాలకు అద్దంపట్టేదే. ఓ పొలంలో పడేసిన వైద్య వ్యర్థాలను గమనించి ఓ కూలీ చేసిన ఫిర్యాదు, పోలీస్‌ కానిస్టేబుల్‌ చూపిన చొరవ ఈ వంచక బృందం బాగోతాన్ని బట్టబయలు చేసింది.

ఈ ఘటన ఓ ముఠా చేసిన నేరం మాత్రమే కాదు. ఔషధ నియంత్రణ వ్యవస్థ ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపింది. లైసెన్స్‌లేని ఫామ్‌ హౌస్‌లో ఇంత పెద్ద స్థాయిలో రీలేబులింగ్‌ యూనిట్‌ నడపడం, పలు రాష్ట్రాల మధ్య మందుల రవాణా, ఆసుపత్రులకు భారీ తగ్గింపుతో అమ్మకాలు, ఈ మందులపై ఉన్న నకిలీ క్యూఆర్‌ కోడ్‌లు పనిచేయకపోయినా పట్టించుకోకపోవడం... ఇవన్నీ నిద్రపోతున్న నిఘా వ్యవస్థను, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనం. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఒక అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ను సస్పెండ్‌ చేయడం, 16 ఫార్మా లైసెన్సులను రద్దు చేయడం, ప్రపంచ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ స్థానిక సరఫరా డిపోతో సహా మరో ఎనిమిది సంస్థల లైసెన్సులను స్తంభింపజేయడం వంటి కర్ణాటక ప్రభుత్వ చర్యలతోనే ఈ భారీ అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుందా అంటే అనుమానమే. సిట్‌కు సహకరించేందుకు సైతం ఫైజర్‌ సంస్థ ముందుకు రాలేదని, ఇప్పటికే చెలామణిలో ఉన్న వాటిని వెనక్కితీసుకోవడానికి పంపిణీదారులు సహకరించలేదన్న కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు ఈ దందా బరితెగింపునే కాదు, వాటికి అండగా ఉన్న రాజకీయ మూలాలకూ నిదర్శనం. అజర్‌బైజాన్‌ నుంచి ఈ దందాను నడుపుతున్నాడని భావిస్తున్న ప్రశాంత్‌ను అరెస్టు చేసి దేశానికి రప్పించి, దోషులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని మోడీ సర్కారుది. 2024లో ఢిల్లీలో కేన్సర్‌, డయాబెటిస్‌ మందుల కల్తీ దందా వెలుగుచూసినా... పైపై చర్యలకే పాలకులు పరిమితం కావడమే ఇటువంటి ఘోరాల కొనసాగింపునకు ఆజ్యం పోస్తుందనేది నిష్టుర సత్యం.

ప్రపంచ ఫార్మసీ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దామని, మేక్‌ ఇన్‌ ఇండియాను విజయవంతం చేశామని చంకలు గుద్దుకునే పాలకులు ఇకనైనా కళ్లు తెరవాలి. దోషులను కఠినంగా శిక్ష‍ించడంతోపాటు దేశీయ చట్టాలను పట్టించుకోని విదేశీ కార్పొరేట్‌ మందుల కంపెనీలకు కళ్లెంవేయాలి. ఔషధ నాణ్యత, భద్రతను నిరంతరం పర్యవేక్ష‍ించే, నకిలీ మందులను ముందుగానే గుర్తించి నిరోధించే బలమైన వ్యవస్థలు రూపొందించడం అత్యవసరం. దేశంలో తయారైన మందులు, వైద్య సామగ్రి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను అందుకునేలా దృష్టి పెట్టాల్సిన బాధ్యత పాలకులదే. అమృతం కావాల్సిన మందులను కాలకూట విషంగా మార్చేయడం మానవత్వానికే మచ్చ. అలాంటి వాటిని నియంత్రించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్