ఎండు మిర్చి కిలో రూ.300 పైమాటే
రూ.వందకు చేరువలో ఉల్లిపాయాలు
బియ్యం, పప్పులు, వంట నూనెలు పైపైకే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఒకవైపు ఉల్లి ధరలు ఇప్పటికే కిలో రూ.100కు సమీపించింది. మరోవైపు ఎండు మిరప కూడా సామాన్యులకు దడ పట్టిస్తోంది. బయట మార్కెట్లో మిర్చి ధర కిలో రూ.300 పైబడి భారంగా మారింది. కందిపప్పు నుంచి పామాయిల్ దాకా ప్రతి నిత్యావసర సరుకు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో ప్రజల బతుకుబండి ముందుకు సాగక సాగిలపడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరల మోతపై ప్రణాళికా శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పలు సరుకుల ధరల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
ఎండు మిర్చి ధరలు ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. గ్రేడ్-1 మిరపకాయల కిలో ధర తాజాగా 297.41గా రికార్డు అయింది. గతేడాది రూ.181.63తో పోలిస్తే ఏకంగా 115.78 శాతం ధర పెరిగింది. గ్రేడ్-2 మిరపకాయల ధర ప్రస్తుతం కిలో రూ.265.72గా ఉండగా, గత నెలలో 259.01తో పోలిస్తే 2.59 శాతం, గతేడాది రూ.160.16గా ఉన్న ధరతో పోలిస్తే 105.56 శాతం పెరగడం గమనార్హం. అయితే బహిరంగ మార్కెట్లో కిలో రూ.300కు పైగానే అమ్ముతున్నారు. దీంతో వినియోగదారుడుపై మరింత భారం పడుతోంది.
ఉల్లిపాయల ధరలు కూడా అదుపులోకి రావడం లేదు. గ్రేడ్-2 ఉల్లిపాయలు కిలో రూ.63.61గా ఉంది. ఆగస్టు 20న ఇదే ధర రూ.43.20గా ఉండగా, నెల వ్యవధిలో కిలోకు రూ.20.41 పెరిగింది. గతేడాది సెప్టెంబరు 20న కిలో రూ.25.71 ఉండగా, ఏడాది కాలంలో రూ.37.90, అంటే ఏకంగా 147.41 శాతం పెరుగుదల నమోదైనట్టు తేలింది. గ్రేడ్-2 ఉల్లి ధర కూడా తాజాగా కిలో రూ.55.73గా ఉండగా, గత నెలలో రూ.36.58గా, గతేడాది రూ.20.89గా ఉండడం గమనార్హం. బయట మార్కెట్లో, చిన్న దుకాణాల్లో అయితే కిలో రూ.75 వరకు చేరిపోయింది.
బియ్యం కిలో వంద
బియ్యం ధరల్లోనూ పెరుగుదల స్పష్టంగా నమోదైంది. గ్రేడ్-1 సూపర్‌ఫైన్ బియ్యం కిలో ధర రూ.68.41గా ఉండగా, గత నెలలో రూ.66.18గా, గతేడాది రూ.60.04తో నమోదైంది. అంటే 8.37 శాతం పెరిగినట్టు తేలింది. గ్రేడ్-2 ఫైన్ బియ్యం కిలో ధర 60.70గా ఉండగా, గత నెలతో పోలిస్తే 2.86 శాతం, గతేడాదితో పోలిస్తే 8.22 శాతం పెరిగింది. దుకాణాల్లో కిలో సూపర్ ఫైన్ బియ్యం 75 నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో సింగిల్ పోలిష్ బియ్యం అంటూ కిలో వంద రూపాయలకు విక్రయిస్తుండడం గమనార్హం.
వంట నూనెల ధరలూ పైపైకే..
వంట నూనెల ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. పామాయిల్ లీటరు ధర ప్రస్తుతం 155.20గా ఉండగా, గత నెలలో 153.45గా, గతేడాది రూ.131.13గా ఉంది. అంటే 24.07 శాతం పెరిగింది. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ లీటరు ధర 181.50గా నమోదైంది. గత నెల ధర 179.22తో పోలిస్తే 1.27 శాతం, గతేడాదితో పోలిస్తే 32.07 శాతం అధికంగా ఉంది. వేరుశెనగ నూనె లీటరు ధర 185.18గా ఉంది. గతేడాది రూ.159.71తో పోలిస్తే 25.47 శాతం పెరిగింది.
గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.135.41గా ఉంది. గతేడాది రూ.116.04గా ఉండగా, ఏడాది కాలంలో 19.37 శాతం పెరిగింది. గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ.124.28గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే 18.55 శాతం పెరిగింది.







కామెంట్‌లు (0)