సియోల్ : దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి మరో కేసులో సియోల్ సెంట్రల్ కోర్టు సోమవారం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఒక రాజకీయ మధ్యవర్తి నుండి 270 మిలియన్ వోన్ల (1,79,800డాలర్ల) విలువైన ప్రజాభిప్రాయ సేకరణ సేవలను ఉచితంగా, చట్టవిరుద్ధంగా పొందారని స్థానిక మీడియా తెలిపింది. రాజకీయ మధ్యవర్తి నుండి ఉచితంగా 14 రౌండ్ల పోలింగ్ సమాచారాన్ని పొందడం, అనంతరం అందుకు ప్రతిఫలంగా ఒక మాజీ ప్రజాప్రతినిధి నామినేషన్ వ్యవహారంలో తన ప్రభావాన్ని వినియోగించి యూన్ సుక్ యోల్ రాజకీయ నిధుల చట్టాలను ఉల్లంఘించారని సియోల్ సెంట్రల్ కోర్టు వెల్లడించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆరోపణలను యూన్ తిరస్కరించారు.
యూన్ ఎనిమిది న్యాయపరమైన కేసులను ఎదుర్కొంటున్నారు. 2024లో స్వల్పకాలం పాటు సైనిక పాలన (మార్షల్ లా) విధించిన నేపథ్యంలో తిరుగుబాటుకు సూత్రధారిగా వ్యవహరించారన్న ఆరోపణలపై కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి ఫిబ్రవరిలో విధించిన జీవిత ఖైదు శిక్షకు వ్యతిరేకంగా ఆయన ప్రస్తుతం అప్పీల్ చేస్తున్నారు. ఇతర కేసులలో, తనను అరెస్టు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ గత వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఉంది.








కామెంట్‌లు (0)