న్యూఢిల్లీ : రెబల్ ఎంపిల విలీనంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రెండువారాల పాటు వాయిదా వేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఆరుగురు రెబెల్ ఎంపిల విలీనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఓంబిర్లా, జాయింట్ సెక్రటరీ తరపున న్యాయవాది హాజరుకాకపోవడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది. అయితే తమకు నోటీసు జారీ అయిందని శివసేన (యుబిటి) తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. ఈ అంశంలో వెంటనే మధ్యంతర ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంపిలపై ఎటువంటి అనర్హత పిటిషన్ దాఖలు కానప్పుడు, విలీనాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం స్పీకర్‌కు లేదని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. స్పీకర్ తమ వాదనను వినిపించే అవకాశం కూడా కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, మధ్యంతర ఉపశమనంపై నిర్ణయం తీసుకునే ముందు ప్రతివాదులకు సమయం ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.
లోక్‌సభ స్పీకర్‌కు, ఆయన కార్యదర్శికి, షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైన ఆరుగురు రెబల్ ఎంపిలకు నోటీసులు జారీ చేయాలని, విలీనంపై తక్షణమే స్టే విధించాలన్న పిటిషన్‌ను జులై 22న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రతివాదుల స్పందన తెలియజేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు, జులై 18న శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపిలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో లోక్‌సభలో శివసేన (యుబిటి) బలం ముగ్గురికి పరిమితమైంది. ఆరుగురు రెబల్ ఎంపిలు సంజయ్ జాదవ్, సంజయ్ పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిఅస్థికర్, భాసాహెబ్ వాక్‌చౌరేలు శివససేనలో చేరడంతో వారి బలం లోక్‌సభలో 13కి పెరిగింది.







కామెంట్‌లు (0)