మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ మంత్రి ముద్రగడ కన్నుమూత

6 రోజుల క్రితం

mudra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా): వైఎస్‌ఆర్‌‌సిపి సీనియర్‌ ‌నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(73) కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాస, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం లేదా గురువారం నిర్వహించనున్నారు. ముద్రగడ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌‌సిపి అధినేత జగన్మోహన్‌‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పిత్రుసమానులైన ముద్రగడ పద్మనాభం మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని జగన్‌ ‌పేర్కొన్నారు.

సిపిఎం సంతాపం

పద్మనాభం మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. రాష్ట్రంలో సీనియర్ రాజకీయవేత్త అయిన ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

ముద్రగడ నేపథ్యం..

1953 జనవరి 23న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు గెలుపొందారు. వీరరాఘవరావు 1977లో మృతి చెందారు. దీంతో పద్మనాభం రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్‌టిఆర్ పిలుపు మేరకు 1982లో టిడిపిలో చేరారు. 1983, 1985లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాకినాడ నుంచి ఒకసారి ఎంపిగా విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌‌టిఆర్‌, చెన్నారెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ ‌తరఫున పోటీ చేసిన మొదటిసారి ఓడిపోయారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2024 ఎన్నికల ముందు వైసిపిలో చేరారు.

కాపు ఉద్యమ నేతగా..

కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ప్రత్యేక ముద్ర ఉంది. కాపులను బిసిల్లో చేర్చాలంటూ ఆయన ఉద్యమాలు చేశారు. 1994లో తొలిసారి తన భార్యతో కలిసి ఆమరణ దీక్షకు దిగారు. అనంతరం కాపుల రిజర్వేషన్ల కోసం మరో ఆరుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. 2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభను నిర్వహించారు. ఈ సమయంలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్