మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలస్తీనా జాతిని నిర్మూలిస్తున్న ఇజ్రాయిల్‌

9 గంటల క్రితం

gaxza
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ఎ.కోటిరెడ్డి

పాలస్తీనా ప్రజలను పూర్తిగా నిర్మూలించటానికి, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలిపివేసుకోవటాని ఇజ్రాయిల్‌ ప్రణాళికా బద్ధంగా ప్రయత్నం చేస్తున్నది. గిల్లికజ్జాలు పెట్టుకున్న తరహాలో నిరంతరం పాలస్తీనాపై కాలు దువ్వుతున్న ఇజ్రాయిల్‌ కు 2023 అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడి సాకుగా దొరికింది. ఆ వంక చూపుతూ అమెరికా పూర్తి మద్దతుతో 2023 అక్టోబరు 8న హమాస్‌పై యుద్ధం పేరుతో పాలస్తీనాపై యుద్ధం ప్రకటించింది. 2023 అక్టోబరు 7- 2026 మార్చి 31వ తేదీల మధ్య కాలంలో ఆక్రమిత పాలస్తీనా భూ భాగాలైన గాజా, తూర్పు జెరూసలెం, ఇజ్రాయిల్‌ ఆక్రమిత ప్రాంతంలోని పాలస్తీనా పౌరులు, బాలలపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండపై విచారణ జరపటం కోసం భారతదేశానికి చెందిన జస్టిస్‌ మురళీధర్‌ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో స్వతంత్ర, అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది.

2023 అక్టోబరు 7 నుండి 2026, మార్చి 31వ తేదీ మధ్యకాలంలో ఇజ్రాయిల్‌ రక్షక దళాలు, సెటిలర్లు జరిపిన దాడులలో 20,179 మంది పాలస్తీనా బాలలు మరణించగా, 44,143 మంది గాయపడ్డారు. 58,000 మంది బాలలు అనాథలుగా మారారు. ఇజ్రాయిల్‌ దాడులలో మరణించిన పాలస్తీనా పౌరులలో బాలలు 30 శాతం ఉన్నారని కమిషన్‌ పేర్కొంది. అంటే మొత్తం మరణాలు 72 వేలకు పైగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి, అనుబంధ సంస్థల అధ్యయనాలలో కూడా వెల్లడైంది. స్వతంత్రంగా మరికొన్ని ఇతర సంస్థలు చేసిన అధ్యయనాలలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది.

నిరంతరం యుద్ధ వాతావరణం, కళ్ళ ముందే తల్లిదండ్రులు, ఆప్తులు చనిపోతుండటం బాలలపై తీవ్ర ప్రభావం చూయిస్తున్నది. వేలాది మంది బాలలు శారీరకంగా, మానసికంగా తీవ్ర అనారోగ్యంతో జీవిస్తున్నారు. ఈ పరిస్థితులు వారిపై చూయించే స్వల్ప కాలిక, దీర్ఘకాలిక, ప్రభావాలను కమిషన్‌ నివేదికలో వివరించింది.

బాలల హక్కుల ఉల్లంఘన

ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య 2025 అక్టోబరు 10న కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరువురి మధ్య గీసిన సరిహద్దు రేఖ ''ఎల్లో లైన్‌''కు చెరో వైపున ఇజ్రాయిల్‌, హమాస్‌ ఉన్నాయి. అది సరిహద్దు గీత అని తెలియకుండా దాటిన పిల్లలు, పెద్దలను ఇజ్రాయిల్‌ సైనికులు కాల్చి చంపుతున్నారు. బాలలను చంపిన తర్వాత తమ బాధ్యత నుండి తప్పించుకొనేందుకు మృతులు టెర్రరిస్టులని ముద్ర వేస్తున్నారు.

ఇజ్రాయిల్‌ సైనికులు వినియోగిస్తున్న ప్రమాదకరమైన ఆయుధాల వలన బయటికి ఎటువంటి చిహ్నాలు కనిపించకుండా పిల్లలకు అంతర్గతంగా అవయవాలు దెబ్బ తినటంతో పాటు రక్తస్రావం జరుగుతున్నది. అంతర్గతంగా అయిన గాయాలను గమనించటం, అవి ఎంత మేరకు హాని కలిగిస్తాయో తెలుసుకోవటం కష్టంగా ఉన్నదని వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. అనేకమందికి గాజాలో వైద్యం చేయటం సాధ్యం కానంత తీవ్ర గాయాలు అవుతున్నాయని, వాటి పరిణామాలు జీవితాంతం వెంటాడతాయని కూడా చెప్పారు. మెదడు, వెన్నెముక గాయాలు, ఎముకలు విరగటం, శరీరం తీవ్రంగా కాలిపోవటం తదితరాలు ఈ జాబితాలో ఉంటున్నాయి. తీవ్రంగా గాయపడిన అనేకమంది పిల్లలలో చూపు, వినికిడి శక్తి తగ్గిపోతున్నది. కొందరు పూర్తిగా చూపు కోల్పోతున్నారు. తీవ్ర గాయాల కారణంగా కంటిచూపు దెబ్బతిన్న పిల్లలలో 48 శాతం మందికి గాయాలను నిర్ధారించటం, వైద్యం చేయటం జరగలేదు. వాటి దీర్ఘకాలిక పరిణామాలను నివారించటం సాధ్యం కాదని చెప్పారు. 2025 జూన్‌ నాటికి గాజాలో 10,000 మంది పిల్లలు వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. గాజాపై దాడులు ప్రారంభించిన 2023 అక్టోబరు నుండి డిసెంబరు నాటికి 1,000 మంది పిల్లలకు కాళ్ళు, చేతులు తొలగించారు.

పాలస్తీనా బాలలు గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జి.హెచ్‌.ఎఫ్‌)కు వెళుతున్నపుడు, లేదా అక్కడి నుండి తిరిగి వస్తున్నపుడు ఇజ్రాయిల్‌ సైనికులు వారిపై కాల్పులు జరుపుతున్నారని డాక్టర్లు కమిషన్‌కు తెలిపారు. జి.హెచ్‌.ఎఫ్‌ కేంద్రాల దగ్గర తాము బాలలపై కాల్పులు జరుపుతున్నట్లు ఇజ్రాయిల్‌ సైనికులు కూడా అంగీకరించారు.

పిల్లలను చంపటమే లక్ష్యంగా దాడులు

ఇజ్రాయిల్‌ సైనికులు అత్యాధునిక ఆయుధాలతో పాలస్తీనా బాలలపై హత్యాకాండ కొనసాగిస్తున్నారు. డ్రోన్‌ను పోలిన క్వాడ్‌ కాప్టర్లతో నిరంతరం నిఘా ఉంచుతున్నారు. చీకట్లో కూడా స్పష్టంగా చూడగల అత్యాధునిక కెమేరాలు, అత్యంత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించే స్నైపర్‌ గన్‌లను క్వాడ్‌కాప్టర్లకు అమర్చి, పాలస్తీనా ప్రజల నివాసాలు, నిర్వాసిత శిబిరాలపై 24 గంటలూ నిఘా కొనసాగిస్తున్నారు. మనుషులు ప్రవేశించలేని చోటుకు, మనుషులు గురిపెట్టలేనంత సూటిగా, బాలలు, యువతపై కాల్పులు జరిపి హత్య చేయటంతో పాటు, పెద్ద సంఖ్యలో వికలాంగులను చేస్తున్నారు. కంప్యూటర్‌లో వీడియో గేమ్‌ ఆడినంత సులభంగా క్వాడ్‌ కాప్టర్లతో లక్ష్యం తప్పకుండా గురిపెట్టి, ఎక్కడ ఉన్నవారినైనా హత్య చేస్తున్నారని కమిషన్‌ పేర్కొంది. పెల్లెట్‌ బాంబులతో పాటు ఇతర పేలుడు పదార్థాలను కూడా క్వాడ్‌ కాప్టర్ల ద్వారా ప్రయోగించి శరణార్ధి శిబిరాలు, పాలస్తీనా ప్రజల నివాస ప్రాంతాలలో విధ్వంసం సృష్టిస్తున్నారు.

బాలలపై టెర్రరిస్టుల ముద్ర

ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పార్లమెంటులోని ఎక్కువ మంది సభ్యులు పాలస్తీనా బాలలంతా భవిష్యత్‌ టెర్రరిస్టులని, కాబట్టి వారిని సమూలంగా నిర్మూలించాలని ప్రణాళికా బద్ధంగా ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయిల్‌కు శతృవు హమాస్‌ కాని, హమాస్‌ సైనిక విభాగం కాని కాదని, గాజాలోని ప్రతి బాలుడు, బాలిక అసలైన శతృవులని ప్రచారం చేస్తున్నారు. గాజాలో ఒక్క బాలుడు, బాలికను కూడా అక్కడ బతకనివ్వబోమంటున్నారు.

బాలురను అవమానిస్తున్నారు

పాలస్తీనియన్లను అవమానించటం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవటంలో భాగంగా బాలురను నగ్నంగా ఫోటోలు తీయటంతో పాటు, వారి తల్లులను, అక్కచెల్లెళ్ళను అవమానిస్తూ పచ్చి బూతులు తిడుతున్నారు. ఇతర ఖైదీల ముందే లైగింక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇజ్రాయిల్‌ జైళ్ళలో పాలస్తీనియన్లను అవమానించటం, హింసించటం చెదురుమదురు సంఘటనలు కాదని, ఇవి వ్యవస్థీకృతంగా చేస్తున్న నేరాలని కమిషన్‌ స్పష్టం చేసింది. కొందరు బాలురను కూడా ఇజ్రాయిల్‌ సైనికులు రేప్‌ చేశారు.

పాలస్తీనా ప్రజల పునరుత్పత్తి శక్తిని దెబ్బతీయటం కోసం ఐ.వి.ఎఫ్‌ సదుపాయం, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆసుపత్రులను ధ్వంసం చేస్తున్నారు. 2023 అక్టోబరు కన్నా 2024 అక్టోబరు నాటికి ప్రసవ సమయంలో తల్లుల మరణాలు మూడు రెట్లు పెరిగాయి.

పాఠశాలల విధ్వంసం

2023 అక్టోబరు7-2025 అక్టోబరు11 మధ్య 564 పాఠశాల భవనాలలో 459 భవనాలను ఇజ్రాయిల్‌ సైనికులు పేల్చివేశారు. 2023, అక్టోబరు 7వ తేదీకి ముందు ఈ పాఠశాలలు రోజుకు రెండు, మూడు షిప్టులలో పని చేస్తుండేవి. దెబ్బతిన్న 459 పాఠశాలలలో 4,87,712 మంది విద్యార్థులు, 18,740 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాల భవనాలను కూల్చివేయటం ఆటలాగా ఉన్నదని ఇజ్రాయిల్‌ సైనికులు చెబుతున్నారు.

పాలస్తీనా ప్రజలు, బాలలపై ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని ప్రపంచమంతా ఖండిస్తున్నది. ప్రధాని మోడీ మాత్రం ఇజ్రాయిల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. కాని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట సాంప్రదాయాలున్న భారత ప్రజలు పాలస్తీనాకే మద్దతిస్తున్నారు. మోడీ ప్రభుత్వ విధానాన్ని వెనక్కు మళ్ళించటానికి పాలస్తీనాకు మద్దతు ఇచ్చే ఉద్యమాలలో ప్రజలు ఉవ్వెత్తున పాల్గొనాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్