మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరశనపై దౌర్జన్యం

9 గంటల క్రితం

cjp protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

నీట్‌ పేపర్‌ ‌లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలన్న డిమాండ్‌‌పై ఢిల్లీ జంతర్‌‌మంతర్ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమ కారుడు సోనమ్‌ వాంగ్‌ చుక్‌ దీక్షా భగ్నానికి శనివారం ఉదయం పోలీసులు చేసిన దౌర్జన్య కాండ ప్రజాస్వామ్యం ఇరుసుగా రాసుకున్న మన రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు. జూన్‌ 28న వాంగ్‌ ‌చుక్‌ ‌నిరాహార దీక్షను ప్రారంభించగా, 21వ రోజున ఢిల్లీ పోలీసులు దీక్షా శిబిరంపై పొద్దుపొద్దున వందలాదిగా వాటర్‌ క్యానన్లు, రబ్బరు బుల్లెట్లను వెంటతెచ్చుకొని తాము ప్రభుత్వ వైద్యులమంటూ విరుచుకుపడి కదల్లేని స్థితిలో ఉన్న వాంగ్‌ ‌చుక్‌‌ను బలవంతంగా అస్పత్రికి తరలించడం దుర్మార్గం. ప్రతిఘటించిన కార్యకర్తలను బలప్రయోగంతో నిలువరించారు. వాంగ్‌ ‌చుక్‌ భార్యకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కాగా ఆస్పత్రిలో వాంగ్‌ ‌చుక్‌ మొక్కవోకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. వాంగ్‌ ‌చుక్‌‌ తరలింపునకు పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్న సాకు హైకోర్టు వ్యాఖ్యలు. హైకోర్టు దీక్షను భగ్నం చేయాలని చెప్పలేదు. ఆరోగ్యం క్షీణిస్తున్న రీత్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మాత్రమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఢిల్లీ పోలీసులు యాక్ట్‌ ‌చేశారని వేరే చెప్పనవసరం లేదు. వాంగ్‌ ‌చుక్‌ ‌దీక్ష చేపట్టాక, ఆయన ఆరోగ్యం క్షీణించాక కూడా మోడీ ప్రభుత్వం కనీస మాత్రం స్పందించకుండా పోలీసులను పంపడం నిరంకుశ పోకడ.

కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకులు అభిజీత్‌ ‌దీప్కే శనివారం నుంచి నిరశన దీక్ష చేపట్టగా, పక్కనే క్రాంతికార్‌ కార్నర్‌‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం సాజీ, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్‌ ‌నిరాహార దీక్ష ప్రారంభించారు. కాగా ముందుగా ప్రకటించిన దాని ప్రకారం పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల తొలి రోజు సోమవారం పార్లమెంట్‌ ‌మార్చ్‌‌కు ఇచ్చిన పిలుపును అందుకున్న యువజనులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలో కదం తొక్కారు. వారిపై సైతం పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ క్యానన్లను ప్రయోగించి, లాఠీ ఛార్జీకి పాల్పడటం మోడీ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనం. పార్లమెంట్‌‌లోనూ ఈ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలు మిన్నంటాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలతో ఆగ్రహం వక్తమవుతోంది. వాంగ్‌ ‌చుక్‌ ‌దీక్షా భగ్నం, విద్యార్థి, యువజనుల ర్యాలీపై పోలీసుల ఉక్కుపాదం, పార్లమెంట్‌‌లో ప్రభుత్వ మూగనోము... ఇవన్నీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకేనని అర్థమవుతుంది.

మెడికల్‌ కాలేజీలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ (‌నీట్‌) ‌మే 3న నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించగా ముందుగానే పేపర్‌ ‌లీకైందన్న వార్తలు కలకలం సృష్టించాయి. రాజస్థాన్‌ ‌బిజెపి ప్రభుత్వం పలువురిని ఆరెస్టులు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా సిబిఐ కి అప్పగించారు. కన్నంలో దొరికిన దొంగ మాదిరి తయారైంది మోడీ ప్రభుత్వ పరిస్థితి. విద్యార్థుల, ప్రతిపక్షాల ఆందోళనలతో ఎట్టకేలకు నీట్‌ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలతో ప్రిపేర్‌ అయిన 20 లక్షల మంది విద్యార్థుల, వారి తల్లితండ్రుల మనో వ్యధ రీఎగ్జామ్‌‌తో తీరేది కాదు. నీట్‌ అనేదే అసమానతలతో కూడుకున్నది. ఎన్‌‌టిఎ వైఫల్యాలకు పెట్టింది పేరు. ఎన్‌‌డిఎ అధికారంలోకొచ్చాక 22 పరీక్షలు వివాదాస్పదమయ్యాయి. మోడీ చేతిలో బందీ అయిన ప్రధాన మీడియా ఈ విషయాలను విస్మరిస్తోంది. గతంలో కాంగ్రెస్‌ అవినీతిపై అన్నా హజారే దీక్షకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు వాంగ్‌ ‌చుక్‌కు ఇవ్వలేదు. నీట్‌ పేపర్‌ ‌లీకేజీలకు బాధ్యతగా మంత్రి రాజీనామా డిమాండ్‌ అత్యంత ‌సహేతుకమైనది. ప్రభుత్వంలో జవాబుదారీతనానికి, బాధితుల్లో భరోసా కలిగిస్తుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. వివాదాలకు కేంద్రంగా ఉన్న ఎన్‌‌టిఎ ను రద్దు చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరపాలి. కేంద్రం మెడలు వంచేందుకు విద్యార్థి, యువత, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు కదలాలి. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్