మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చింటూ - అదృశ్య మంత్రం

10 గంటల క్రితం

story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అనగనగా ఒక దట్టమైన అడవిలో 'చింటూ' అనే ఒక చిన్న తెల్లటి కుందేలు ఉంది. ఒకరోజు చింటూ అడవిలో తీపి క్యారెట్లు వెతుక్కుంటూ పొదల చాటుకు వెళ్లింది. దురదృష్టవశాత్తూ, అకస్మాత్తుగా దాని ముందుకొక పెద్ద ఆకలితో ఉన్న పులి వచ్చి గర్జిస్తూ నిలబడింది. ఆ పులి క్రూరంగా నవ్వుతూ, ‘ఆహా! ఈ రోజుకు మంచి లేత విందు దొరికింది. నిన్ను ఇప్పుడే నమిలి తినేస్తా!’ అంది నోరూరుస్తూ. చింటూ మొదట భయపడినా, వెంటనే గుండె ధైర్యం తెచ్చుకుని ఒక ఉపాయం ఆలోచించింది. ధైర్యంగా పులి వైపు చూసి, ‘పులి రాజా! మీరు నన్ను ఎలాగైనా తినొచ్చు. కానీ, చనిపోయే ముందు నాదొక చిన్న విన్నపం. ఈ అడవిలో మీకంటే బలవంతులు ఎవరూ లేరు. కానీ, వేటాడేటప్పుడు మీరు పొదల చాటున దాక్కున్నా జింకలు మిమ్మల్ని చూసి పారిపోతున్నాయి కదా? నా దగ్గర ఒక "అదృశ్య మంత్రం" ఉంది. ఆ మంత్రం తెలిస్తే మీరు వేటాడేటప్పుడు ఏ జంతువుకూ కనిపించకుండా అదృశ్యమైపోవచ్చు! సులువుగా వేటాడవచ్చు’ అంది.

పులి ఆశగా, ‘నిజమా! ఆ మంత్రం ఏంటో త్వరగా చెప్పు!’ అంది. ‘చెబుతాను పులి రాజా! కానీ, ఆ మంత్రం మీకు సొంతం అవ్వాలంటే నేను అడిగే ఒక పొడుపు కథకు మీరు సమాధానం చెప్పాలి. దానికి మీరు సరైన సమాధానం చెబితే, నేనే సంతోషంగా ఆ మంత్రాన్ని మీకు బోధిస్తాను. ఒకవేళ మీరు సమాధానం చెప్పలేకపోతే నన్ను వదిలేయాలి’ అంది చింటూ.

పులి అహంకారంతో, ‘సరే, అడుగు!’ అంది. ‘మనం ఎంత దూరం ముందుకు నడిచినా... మనల్ని వదలకుండా ఎప్పుడూ మన వెనుకే నడుస్తూ, మనం వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మన కళ్లకు కనిపించకుండా దాక్కునేది ఏది?’ అని అడిగింది. పులి తల గోక్కుంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. అడవిలో ఉన్న జంతువులన్నింటి గురించి, చెట్ల నీడల గురించి ఆలోచించింది. కానీ, వెనక్కి తిరిగితే కనిపించకుండా దాక్కునేది ఏంటో దానికి అస్సలు అర్థం కాలేదు. ఎంతసేపటికీ సమాధానం తట్టకపోయేసరికి, పైగా ఆ అదృశ్య మంత్రం ఎక్కడ చేజారిపోతుందో అన్న కంగారుతో, ‘నాకు తెలియడం లేదు, నువ్వే చెప్పు!’ అంది కోపంగా.

చింటూ నవ్వుతూ కొంచెం వెనక్కి జరిగి, ‘చాలా సులభం పులి రాజా! అది "మన వీపు". మనం ఎంత ముందుకు నడిచినా అది మన వెనుకే వస్తుంది. కానీ, మనం ఎంత వెనక్కి తిరిగి చూసినా ఎప్పటికీ మన కంటికి కనిపించదు!’ అంది. పులి ఆ సమాధానానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, తన వీపును తాను చూసుకోవడానికి గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. పులి అలా తన తోక చుట్టూ తాను తిరుగుతూ కంగారు పడుతుండటం చూసి చింటూ ఒక్క ఉదుటున పొదల్లోకి దూకి, క్షణాల్లో అక్కడి నుండి తప్పించుకుని హాయిగా ఇంటికి చేరుకుంది. పులి ఆ మంత్రం అబద్ధమని గ్రహించి, తన తెలివితక్కువతనానికి తనే సిగ్గుపడింది.


- కె.వి. సుమలత, గుడివాడ, కృష్ణ జిల్లా,

94926 56255.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్