మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లలు రాసిన పర్యావరణ కథలు...

10 గంటల క్రితం

stories
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పిల్లలతో పర్యావరణ కథలు చెప్పించడం అంత సులువు కాదు. అలా చేయాలంటే తమ చుట్టూ ఉన్న పరిస్థితులను వాళ్లు అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి పుట్టే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. చెన్నైకి చెందిన 'అగై – థియేటర్ ఆఫ్ వాయిసెస్' అనే సంస్థ ఇదే పనిని చేస్తోంది. ఏడాది పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 'ఎంగే ఎంగళ్ నదిగళ్' (మా నదులు ఎక్కడ?) పేరుతో తోలుబొమ్మలాటలను ప్రదర్శిస్తోంది. ఈ ప్రదర్శనల్లో ప్రధాన భూమిక పోషించేది పిల్లలే. వాళ్లు చూసిన, విన్న అనుభవాల ఆధారంగా స్వయంగా కథలు రాసుకుంటున్నారు. పల్లవరం ప్రాంతానికి చెందిన నరికురవ గిరిజన సమాజ పిల్లలు చెబుతున్న ఈ పర్యావరణ కథలు ఊహల్లో పుట్టినవి కావు. వారు జీవిస్తున్న ప్రపంచం నుంచే పుట్టుకొచ్చిన అనుభవాలే!


ఈ కథలకు జీవం పోయేందుకు సంస్థ తరఫున 15 మంది చిన్నారులు ఈ నెల 18న ఉత్తర చెన్నై నుంచి దక్షిణ చెన్నై వరకు 'టాక్సిక్ టూర్' పేరుతో ప్రత్యేక పర్యటన చేపట్టారు. ఈ ప్రయాణంలో అభివృద్ధి దిశగా పారిశ్రామిక నగరంగా ఎదుగుతున్న చెన్నైని, ఆకాశాన్ని తాకుతున్న పొగగొట్టాలను, తొలిసారిగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను, అదాని పోర్టును, ఆయిల్ రిఫైనరీలను సందర్శించారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న మార్పులు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యక్షంగా గమనించారు. కాలుష్యమైన గాలి, కలుషితమైన నీరు మనుషుల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతున్నాయో అర్థం చేసుకున్నారు. ఈ పర్యటన కేవలం అవగాహన కోసం కాదు. పిల్లల్లోని పరిశోధనా దృక్పథాన్ని మేల్కొల్పి, వారు ప్రదర్శించబోయే నాటకాలకు అవసరమైన కథలను వెలికితీసే ప్రక్రియగా మారింది.

ఇద్దరు మిత్రులు – 'అగై'

పిల్లలను పర్యావరణ పరిశోధకులుగా తీర్చిదిద్దే 'అగై' సంస్థను చెన్నైకి చెందిన టిట్టు, నంబి శ్రీనివాస్ స్థాపించారు. జెన్–జెడ్ తరానికి చెందిన ఈ యువకులు తమ తరం వారిలో సామాజిక, పర్యావరణ న్యాయం పట్ల చైతన్యం పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్‌లో చదువుతున్న రోజుల్లో వీరి పరిచయం ఏర్పడింది. తరువాత టిట్టు బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్, నంబి సామాజిక అభివృద్ధి అధ్యయనం చేసినప్పటికీ వారిని కలిపింది మాత్రం థియేటర్ పట్ల ఉన్న అభిరుచే.


సామాజిక సేవ అనేది కేవలం వృత్తిపరమైన ఎంపిక కాదని, అది వారసత్వంగా వచ్చిన నమ్మకాలను ప్రశ్నించే దృక్పథాన్ని పెంపొందిస్తుందని టిట్టు భావిస్తారు. సమాజాల తరఫున మాట్లాడే బాధ్యతను అది కలిగిస్తుందని ఆయన చెబుతారు. ఈ ఆలోచనలతోనే ఇద్దరూ 2023లో 'అగై'కు రూపకల్పన చేశారు. తిరువనంతపురంలో జరిగిన అంతర్జాతీయ లీడర్‌షిప్ కార్యక్రమం 'కాంతారి'కి టిట్టు ఎంపిక కావడం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఆ కార్యక్రమంలో టిబెట్ తొలి అంధుల పాఠశాల వ్యవస్థాపకురాలు సబ్రియే టెన్‌బెర్కెన్‌ను కలిసిన తర్వాత 'అగై' ఆలోచనకు మరింత స్పష్టమైన రూపం లభించింది.

వినడానికి సిద్ధంగా ఉండాలి!

'వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్' (మాటలేని వారి తరఫున గొంతుక) అనే భావనను టిట్టు పూర్తిగా వ్యతిరేకిస్తారు. "ప్రతి మనిషికీ ఇప్పటికే ఒక గొంతు ఉంది. ఇప్పుడు అవసరమైంది వారి మాట వినడానికి సిద్ధంగా ఉండే మనుషులు" అనేదే 'అగై' సూత్రం. పల్లవరంలోని నరికురవ సమాజ పిల్లలతో చేపట్టిన కార్యక్రమంతో సహా సంస్థ నిర్వహించే ప్రతి కార్యాచరణ ఈ ఆలోచన చుట్టూనే సాగుతోంది. గత రెండు నెలలుగా 'అగై' బృందం ఈ పిల్లలతో కలిసి పనిచేస్తోంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ, వారితో మాట్లాడుతూనే బొమ్మలు తయారు చేయించారు. అదే ప్రక్రియలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. పిల్లలు తమ చేతులతో తయారుచేసుకున్న బొమ్మలతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు వారి అనుభవాలు ఒక్కొక్కటిగా కథలుగా బయటకు వచ్చాయి. ఈ అనుభవాన్ని టిట్టు వివరిస్తూ, "బొమ్మలు ఇచ్చిన తర్వాత పిల్లలు వాటితో తమంతట తామే సంభాషించడం మొదలుపెట్టారు. ఒక పిల్లవాడు అడవి గురించి చెప్పాడు. మరొక పిల్లవాడు తాను ఎప్పుడూ చూడని గంగా నది గురించి మాట్లాడాడు. పెద్దలు ఎన్నడూ వారికి ఈ విషయాలు చెప్పలేదు. వాళ్లు కూడా అడగలేదు. కానీ బొమ్మలే వాళ్ల భావాలను బయటకు తీసుకొచ్చే వేదికలుగా మారాయి" అని చెప్పారు.


అలా పుట్టిన కథలే చివరకు 'ఎంగే ఎంగళ్ నదిగళ్' (మా నదులు ఎక్కడ?) కార్యక్రమంగా రూపుదిద్దుకున్నాయి. రాబోయే రోజుల్లో పిల్లలు స్వయంగా రాసిన కథలను మరింత అభివృద్ధి చేసి కొత్త ప్రదర్శనలు సిద్ధం చేయాలని సంస్థ భావిస్తోంది. ఆ ప్రదర్శనలను చెన్నైలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రదర్శించనుంది. అంతరించిపోతున్న నదులు, పర్యావరణ విధ్వంసం, పిల్లలు జీవిస్తున్న ప్రపంచం గురించి పిల్లలే ప్రేక్షకులతో మాట్లాడేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టిట్టు చెప్పారు.

పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని ఆ పిల్లలను పుస్తకాల ముందు ఒక గంట సేపు కూర్చొబెట్టడం చాలా కష్టం. అందుకే టిట్టూ బృందం ఈ పిల్లలను నిశ్శబ్ధంగా కూర్చోమని, తాము చెప్పింది వినమని చెప్పడం లేదు. ‘పిల్లలు ఒక వ్యవస్థకు అలవాటు పడడం మాకు ఇష్టం లేదు. వారితో పాటు ఎదిగే ఒక వ్యవస్థను మేం నిర్మించాలనుకుంటున్నాం` అంటున్నారు.

బహుళ సంస్థలతో..

‘అగై` సంస్థ, వెట్టివర్ కలెక్టివ్, చెన్నై క్లైమేట్ యాక్షన్ గ్రూప్, ఓపెన్ హౌస్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జులై 25న బెసెంట్ నగర్ బీచ్ లో జరగబోతున్న 'మార్చ్ ఫర్ మార్షలాండ్స్`ర్యాలీని నిర్వహిస్తున్న సంస్థల్లో ఇది కూడా ఉంది. చిత్తడి నేలల సంరక్షణ, అక్రమ ఆక్రమణలు, అసౌకర్యమైన ప్రాజెక్టులు, మమ్మళం రిజర్వాయర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ జరగనుంది. నీలగిరిలో గిరిజన విద్యా కార్యక్రమాన్ని కూడా ‘అగై` నిర్వహిస్తోంది. పిల్లల హక్కులపై డిజిటల్ కామిక్స్‌కు మద్దతు ఇస్తోంది, పర్యావరణ నేపథ్యాల ఆధారంగా సంగీతాన్ని రూపొందించే అగై స్టెల్లార్ బ్యాండ్‌ను నిర్వహిస్తోంది. సర్వేలు, గణాంకాలకు బదులుగా అనుభవాల ద్వారా పట్టణ విద్యార్థులను గిరిజన సంఘాలకు పరిచయం చేసే యూత్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తోంది.


పిల్లలకు పర్యావరణాన్ని పాఠ్యాంశంగా కాకుండా అనుభవంగా పరిచయం చేయాలన్న 'అగై' ప్రయత్నం ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ విద్యా నమూనాగా నిలుస్తోంది. నదులు, అడవులు, కాలుష్యం, ప్రకృతి గురించి పెద్దలు చెప్పే పాఠాల కంటే, పిల్లలు స్వయంగా చెప్పే కథలే సమాజాన్ని ఎక్కువగా ఆలోచింపజేస్తాయని ఈ ప్రయోగం నిరూపిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్