పని దినాలు 229 రోజులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం 229 రోజులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేసింది. మొత్తం 316 పని దినాల్లో 87 రోజులు సెలవులు ఉంటాయని, 229 రోజులు పాఠశాలలు జరుగుతాయని వెల్లడించింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరుగుతాయని తెలిపింది. జులై 10న, డిసెంబర్ 5న మెగా పెరేంట్స్, టీచర్స్ మీటింగ్ (పిటిఎం) నిర్వహిస్తామని ప్రకటించింది. దసరా సెలవులు అక్టోబరు 12 నుంచి 21వ తేదీ వరకు సాధారణ పాఠశాలలకు, మైనార్టీ పాఠశాలలకు అక్టోబరు 15 నుంచి 21 వరకు ఉంటాయని తెలిపింది. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు సాధారణ పాఠశాలలకు, మైనార్టీ పాఠశాలలకు జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ పాఠశాలలకు డిసెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు క్రిస్మస్ సెలవులుగా ప్రకటించింది. ఫార్మెటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఎ-1) పరీక్షలు ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకు, ఎఫ్ఎ-2 పరీక్షలు అక్టోబరు 5 నుంచి 8వ తేదీ వరకు, సమ్మెటీవ్ అసెస్మెంట్ (ఎస్ఎ)-1 పరీక్షలు నవంబర్ 9 నుంచి 20వ తేదీ వరకు, ఎఫ్ఎ-3.. 2027 జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు, ఎఫ్ఎ-4.. ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు, 9, 10వ తరగతులకు ఎస్ఎ-2 ఫిబ్రవరి 24 నుంచి మార్చి9వ తేదీ వరకు జరగనున్నాయి. మిగిలిన తరగతులకు ఎస్ఎ-2 ఏప్రిల్ 3 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని ప్రాథమికంగా వెల్లడించింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని ప్రకటించింది.









కామెంట్‌లు (0)