న్యూఢిల్లీ : దేశంలో ఇకపై విమాన టిక్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వమే నియంత్రించనుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విమాన ఛార్జీల విషయంలో జోక్యం చేసుకునే అధికారాన్ని తన పరిధిలోకి తెచ్చుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'భారతీయ వాయుయాన్ నియమ్–2026' పేరుతో కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం .... ప్రత్యేక పరిస్థితుల్లో విమాన టికెట్ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తే సంబంధిత విమానయాన సంస్థలకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే ఈ ఆదేశాలు పరిస్థితులకు తగినట్లుగా, నిర్దిష్ట పరిమితుల్లోనే ఉండాలి. నిర్ణయించిన కాలవ్యవధి వరకే అమల్లో ఉంటాయి. ముడి చమురు, విమాన ఇంధనం (ATF) ధరలు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
విమాన టికెట్ ధరలపై రూల్ 192 ఏం చెబుతోందంటే ?
కొత్త నిబంధనల్లోని రూల్ 192 ప్రకారం ... షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు తమ నిర్వహణ వ్యయాలు, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు. అయితే ఆ ధరల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమర్పించాలి. అసాధారణ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల కోసం జోక్యం అవసరమని కేంద్రం భావిస్తే, ఆయా సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వవచ్చు.
ధరల వివరాల వెల్లడికి ప్రాధాన్యం ....
ప్రయాణికులకు టికెట్ ధరలపై స్పష్టత కల్పించేందుకు విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లు, ఇతర డిజిటల్ వేదికల్లో ఛార్జీల వివరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. టికెట్ ధరలో భాగంగా ఉన్న బేస్ ఫేర్, పన్నులు, ఇతర ఫీజులు, రద్దు ఛార్జీలు, రీఫండ్ నిబంధనలు, అదనపు ఛార్జీలను విడివిడిగా వెల్లడించాలి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసే సమయంలో పూర్తి ధరను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
1994 నుంచి మార్కెట్ ఆధారంగానే ధరల నిర్ణయం ...
భారతదేశంలో 1994 లో విమాన టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలను తొలగించారు. అప్పటి నుంచి విమానయాన సంస్థలే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ణయిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్, నిర్వహణ ఖర్చులు, ముందస్తు బుకింగ్ సమయం వంటి అంశాలు టికెట్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ విధానంలో భాగంగా ఒకే విమానంలో ప్రయాణించే వారికి కూడా వేర్వేరు ధరలకు టికెట్లు లభిస్తున్నాయి.
పాత నిబంధనలతో పోలిస్తే మార్పులేమిటి ?
గతంలో అమల్లో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ రూల్స్–1937లోని రూల్ 135(4) ప్రకారం ... అధిక ధరలు, పోటీని దెబ్బతీసే విధంగా ధరల నిర్ణయం (Predatory Pricing), కొన్ని సంస్థల ఆధిపత్యంతో మార్కెట్లో పోటీ తగ్గించే విధానాలు (Oligopolistic Practices) వంటి అంశాల ఆధారంగా DGCA జోక్యం చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా తీసుకొచ్చిన రూల్ 192 లో ... అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారానికి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పాత నిబంధనల్లో పేర్కొన్న అధిక ధరలు, ప్రిడేటరీ ప్రైసింగ్, ఒలిగోపాలిస్టిక్ విధానాలను కొత్త నిబంధనల్లో ప్రత్యేక జోక్య కారణాలుగా స్పష్టంగా ప్రస్తావించలేదు.
ప్రయాణికులకు ఎంతవరకు ప్రయోజనం ?
కొత్త నిబంధనల వల్ల విమాన టికెట్ ధరలు వెబ్ సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణీకులు తెలుసుకుంటారు. అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే సాధారణ రోజుల్లో విమానయాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగానే ఛార్జీలను నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ నిర్ణయం వల్ల అన్ని సందర్భాల్లోనూ టికెట్ ధరలు తగ్గుతాయని చెప్పలేం. ధరల నియంత్రణ విషయంలో అవసరమైనప్పుడు ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారాన్ని కల్పించడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం.








కామెంట్లు (0)