న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా పెంచుతూ విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ నిబంధనలు, 1980 సవరణల ప్రకారం ఈ కొత్త రుసుములు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఫీజులను సవరించడం గమనార్హం.
సవరించిన ధరల ప్రకారం, సాధారణ విభాగంలో 36 పేజీల కొత్త లేదా పునరుద్ధరణ పాస్‌పోర్ట్ ఫీజు ప్రస్తుతం ఉన్న రూ.1,500 నుండి రూ.2,500కి పెరిగింది. అలాగే 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ధర రూ.2,000 నుండి రూ.3,500కి చేరింది.
అత్యవసరంగా పాస్‌పోర్ట్ పొందే తత్కాల్ విభాగంలోనూ ఛార్జీలు భారీగా పెరిగాయి. 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుండి రూ.5,000కి పెరగ్గా.. 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.4,000 నుండి ఏకంగా రూ.6,000కి పెరిగింది. పెరిగిన ఛార్జీలతో పాటు మైనర్ల పాస్‌పోర్టులు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అలాగే పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా పాడైనా జారీ చేసే డూప్లికేట్ పాస్‌పోర్ట్ ఫీజులను కూడా ప్రభుత్వం సవరించింది. పాత ధరలకే పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.






కామెంట్‌లు (0)