- దేశీయ చట్టాలు వర్తిస్తాయన్న బాంబే హైకోర్టు
న్యూఢిల్లీ : అదానీ విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో విక్రయించే వస్తువులు దేశీయ చట్టాల పరిధి నుంచి మినహాయింపు పొందలేవని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో అనుమతులు లేని నికోటిన్ పౌచ్‌లను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో విక్రయించడంపై ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని సవాలు చేస్తూ అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో అదానీ గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
భారత్‌లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోయినా నికోటిన్ పౌచ్‌లను ముంబయి విమానాశ్రయంలో విక్రయిస్తున్నారని గతంలో అధికారులు వెల్లడించారు. దీన్ని సవాల్ చేస్తూ ఏప్రిల్‌లో గౌతమ్ అదానీ తరఫున అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. భారత్‌లో ప్రస్తుతం ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తున్న బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ పెరుగుతున్న విమాన ప్రయాణాల డిమాండ్‌ను నగదు చేసుకునేందుకు డ్యూటీ ఫ్రీ షాపుల విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. నికోటిన్ పౌచ్‌లను నిల్వ చేయడం డ్రగ్ చట్టాల తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుందని.. ఇది తీవ్రమైన ప్రజా ఆరోగ్య ముప్పు అని అధికారులు కోర్టులో వాదించారు.






కామెంట్‌లు (0)