బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెగని పంచాయితీ..

-87 నిమిషాల క్రితం

river
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కృష్ణాజలాలపై ఎటూ తేల్చని కేంద్రం

- కోర్టును ఆశ్రయించిన కర్నాటక

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కృష్ణాజలాల విషయం మరోసారి చర్చనీయాంశం అయింది. కృష్ణా వాటర్‌ ‌డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌(‌బ్రిజేష్‌‌కుమార్‌)-2 పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 28తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ‌ఫునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులపై ఎపి సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో బ్రిజేష్‌‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌‌ తీర్పును నోటిఫై చేసే అంశంలో గడువును ఏడాదికేడాది పొడిగించుకుంటూ వస్తున్నారు. మరోవైపు కర్నాటక కృష్ణానదిపై పరిమితికి మించి ప్రాజెక్టులు కట్టడంతోపాటు ఆల్మట్టి ఎత్తును పెంచుతోంది. దీనివల్ల దిగువ రాష్ట్ర్రాల హక్కులను భంగం కలిగే ప్రమాదం ఉంది. బ్రిజేష్‌‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌లో మహారాష్ట్ర, కర్నాటక, ఎపికి కేటాయింపులు జరిగాయి. అనంతరం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయింది. అప్పటి నుండి నీటి పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. దీనిపై కర్నాటక సుప్రీం కోర్టులో పిటీషన్‌ ‌దాఖలు చేయడంతోపాటు గతంలో ఇచ్చిన కేటాయింపులను నోటిఫై చేయాలని కోరింది. రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో పంపిణీ జరగని నేపథ్యంలో వాయిదా వేయాలని ఎపి కోరుతున్నా కర్నాటక కేసు వేయడం చర్చనీయాంశం అయింది. రెండు రోజుల క్రితమే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్-2 అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956 కింద తన నివేదికను 2010 డిసెంబర్‌ 30‌న అందించింది. చట్టంలో సెక్షన్‌ 5(3)) కేంద్ర ప్రభుత్వం కోరిన వివరాల కోసం ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను సిఫారసు చేస్తూ నవంబర్ 29, 2013న మరో నివేదికను అందజేసింది. 2010 నాటి ఉత్తర్వులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ చట్టంలో సెక్షన్ 6(1) ప్రకారం పంపిణీపై అధికారిక గెజిట్‌లో ప్రచురించకూడదని సెప్టెంబర్ 16, 2011న మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లో సెక్షన్ 89 ప్రకారం కొత్త రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అవసరాలను పరిశీలించడానికి ట్రిబ్యునల్ గడువును ప్రతీ ఏటా పొడిగించుకుంటూ వస్తున్నారు, గతేడాది ఆగస్టు ఒకటోతేదీ నుండి ఒక ఏడాదిపాటు పొడిగిస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ (నెం. 3221(E)) జూలై 15, 2025న జారీ చేసింది. పొడిగింపు గడువు ముగుస్తున్న సమయంలోనే కర్నాటక కోర్టులో కేసు వేయడం చర్చనీయాంశం అయింది. కృష్ణానది జలాలపై ఉన్న వివాదాన్ని పరిష్కరించకుండా సుదీర్ఘకాలం కొనసాగిస్తూ వస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తెలంగాణా రాష్ట్రానికి జరిగిన సాధారణ ఎన్నికల్లో కృష్ణాజలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని లబ్దిపొందేందుకు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీం కోర్టు కేసు నేపధ్యంలో ఈ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. అయితే ఎపిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్