బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

9 నిమిషాల క్రితం

Kalyan Krishnamurthy resigns as Flipkart CEO
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - బిజినెస్‌ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఫ్లిప్‌కార్ట్‌తో పదకొండేళ్లకు పైగా కొనసాగిన అనుబంధానికి ఆయన ముగింపు పలికారు. ఆయన రాజీనామా విషయాన్ని బుధవారం కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 4 వరకు కళ్యాణ్ సీఈఓగా కొనసాగనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, బోర్డుతో కలిసి సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా పర్యవేక్షించనున్నారు.


2017 జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన కళ్యాణ్ కృష్ణమూర్తి, 2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. అంతకుముందు టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, ఈబే, పీఅండ్‌జీ వంటి సంస్థల్లో పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే 2018లో అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది.


కళ్యాణ్ నేతృత్వంలో ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకుంది. ఈ-కామర్స్‌తో పాటు కిరాణా, ఫిన్‌టెక్, క్విక్ కామర్స్ విభాగాల్లోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా వేగవంతమైన డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ వ్యాపార వృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు.


50 కోట్లకు పైగా వినియోగదారులున్న ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఈఓ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే సంస్థ హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చింది. భారత మార్కెట్‌లో దీర్ఘకాలిక అవకాశాలపై తమకు విశ్వాసం ఉందని, ఫ్లిప్‌కార్ట్ పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్