బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

16 నిమిషాల క్రితం

దాడిస
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 04:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విబి- జి- రామ్- జి పథకం ద్వారా జిల్లాలో 6000 ఎకరాల పశుగ్రాస పెంపకం చేపట్టాలి

- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజాశక్తి - యాదమరి(చిత్తూరు): పశుగ్రాసాలవినియోగంపై పశు పోషకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు బుధవారం స్థానిక కలెక్టెట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు విబి- జి- రామ్- జి పథకం ద్వారా పశుగ్రాస పెంపకం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి ఉమామహేశ్వరి, జిల్లాలోని పశుసంవర్ధక శాఖ సహా సంచాలకులు, వ్యవసాయ రంగాల అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6 వేల ఎకరాల మేరకు పశుగ్రాస పెంపకం చేపట్టాలని ఆదేశించారు. పాడి రైతులకు ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలపై ప్రతిరోజు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ 10 తేదీన జిల్లాలోని పశుగ్రాస పెంపకంపై ఆయా మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో పశుగ్రాస పర్యవేక్షణ కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

గ్రామ స్థాయిలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పశుగ్రాసాల వినియోగంపై పశు పోషకులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి పశు వైద్యశాల పరిధిలో ఓ ‘పశుగ్రాస అభివృద్ధి కమిటీ’ని ఏర్పాటు చేయాలి. పశుగ్రాస విత్తనాల వినియోగం, నీటి వనరుల లభ్యత, మాగుడు గడ్డీ.. తయారీ వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని వివరించారు. జిల్లా స్థాయిలో మాగుడుగడ్డి (సైలేజి), సంపూర్ణ మిశ్రమ దాణా తయారీ, సరఫరాకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పశు వైద్య కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో భవిష్యత్ అవసరాల కోసం పశుగ్రాస నిల్వ కేంద్రాల ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి మురళి, డిప్యూటీ డైరెక్టర్లు గోవిందు, ఆరిఫ్, డిఆర్డిఏ పిడి శ్రీదేవి, డ్వామా ఏ పీ డి ధనలక్ష్మి, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్