ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Historic profit - మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక లాభం - ఒక్క రోజులో 450 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ .. !

1 రోజు క్రితం

Historic profit for Microsoft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 10:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఒక్క రోజులో 450 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ పెరుగుదల


న్యూయార్క్‌ : అమెరికా టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ స్టాక్‌ మార్కెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసింది. గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 16 శాతం ఎగసిపడటంతో ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్‌ విలువ 450 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.42 లక్షల కోట్లకు పైగా) పెరిగింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒకే ట్రేడింగ్‌ సెషన్‌లో ఏ కంపెనీకి ఇంత భారీ స్థాయిలో మార్కెట్‌ విలువ పెరగడం ఇదే తొలిసారి.


ఈ పెరుగుదలతో మైక్రోసాఫ్ట్‌ మొత్తం మార్కెట్‌ విలువ 3.35 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా పేరిట ఉండేది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్విడియా మార్కెట్‌ విలువ ఒకే రోజులో 440 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇప్పుడు ఆ రికార్డును మైక్రోసాఫ్ట్‌ అధిగమించింది.


కంపెనీ ప్రకటించిన తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మదుపర్ల అంచనాలను మించాయి. ముఖ్యంగా అజ్యూర్‌ క్లౌడ్‌ విభాగం ఆదాయం 43 శాతం వృద్ధి నమోదు చేయడం, మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్‌ ఎఐ సేవకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించడం షేర్ల ర్యాలీకి ప్రధాన కారణాలయ్యాయి. కోపైలట్‌ వినియోగదారుల సంఖ్య ఇప్పటికే మూడు కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ షేర్లు 2008 తర్వాత అత్యధికంగా ఒక్క రోజులో 16 శాతం లాభపడ్డాయి.


మరోవైపు మెటా షేర్లు 8 శాతం వరకు క్షీణించాయి. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు, కృత్రిమ మేధ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులపై మదుపర్ల ఆందోళన షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా మెటా షేర్లు వరుసగా 11వ ట్రేడింగ్‌ రోజూ నష్టాలతో ముగిశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్