బ్యాంకింగ్, ఐటీ షేర్ల జోరు.. ఎఫ్‌ఐఐల పెట్టుబడులతో మార్కెట్లకు ఊపు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 2 వేల పాయింట్లకు పైగా ఎగబాకి 84,498.21 వద్ద గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 500 పాయింట్లకు పైగా లాభపడి 25,900 స్థాయిని అందుకుంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా దోహదపడ్డాయి.
మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి సెన్సెక్స్ 1,339.08 పాయింట్ల లాభంతో 83,775.07 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 383 పాయింట్లు పెరిగి 25,733.20 వద్ద కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి.
మార్కెట్ల ర్యాలీకి కారణాలివే ..
లార్జ్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు: అధిక వెయిటేజీ కలిగిన పెద్ద కంపెనీల షేర్లు రాణించడం సూచీలకు బలాన్నిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో వంటి షేర్లు సుమారు 4 శాతం మేర లాభపడటంతో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.
ఎఐ షేర్ల నుంచి పెట్టుబడుల మళ్లింపు : జెన్సన్ హువాంగ్ రాకతో ఊపందుకున్న టెక్నాలజీ షేర్లు మళ్లీ పతనమయ్యాయి. గత సెషన్‌లో నాస్‌డాక్ 1.5 శాతం, ఎన్విడియా 6 శాతం మేర నష్టపోయాయి. ఏఎండీ, మైక్రాన్ వంటి ఏఐ సంబంధిత కంపెనీల షేర్లు కూడా క్షీణించాయి. దక్షిణ కొరియా సంస్థలు శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ షేర్లు సైతం 9 శాతం మేర పడిపోయాయి. డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులకు ఆశించిన రాబడులు వస్తాయా అనే సందేహాలు పెరగడంతో ఏఐ రంగంపై ప్రతికూల సెంటిమెంట్ నెలకొంది. దీంతో విదేశీ మదుపర్లు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల వైపు పెట్టుబడులు మళ్లించడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది.
ఎఫ్‌ఐఐల భారీ పెట్టుబడులు : విదేశీ సంస్థాగత మదుపర్లు ఈ నెలలో భారత మార్కెట్లలో రికార్డు స్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. సోమవారం ఒక్కరోజే రూ.5,673 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది.
రూపాయి బలోపేతం.. ముడిచమురు ధరలు : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 56 పైసలు బలపడి 92.29 వద్ద కొనసాగింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయిలో ఉండటం కూడా దేశీయ మార్కెట్లకు అనుకూలంగా మారింది. ఈ పరిణామాలు మార్కెట్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.







కామెంట్‌లు (0)