బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజస్థాన్‌లో వణికిస్తున్న చలి.. 4.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతతో ఫతేపూర్ టాప్

17 నిమిషాల క్రితం

రాజస్థాన్‌లో వణికిస్తున్న చలి.. 4.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతతో ఫతేపూర్ టాప్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 02:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జైపూర్ : ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాజస్థాన్‌లో శీతాకాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. బుధవారం సికర్ జిల్లాలోని ఫతేపూర్ రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతంగా నమోదైంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.


పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజలాడుతున్న జిల్లాలు :

ఫతేపూర్ తర్వాత సికర్ జిల్లా కేంద్రంలో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పర్యాటక ప్రాంతమైన మౌంట్ అబూలో 7.1 డిగ్రీలు, నాగౌర్‌లో 6.4, చురులో 7.7, బనస్థలిలో 8, అల్వార్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయ్‌పూర్, కరౌలీలలో 8.6 డిగ్రీలు, పిలానీలో 9, అజ్మీర్‌లో 9.1, చిత్తోర్‌గఢ్, ఝుంఝునులలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తెల్లవారుజామున పొగమంచు, చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.


ప్రధాన నగరాల్లో వాతావరణ పరిస్థితి :

రాజధాని జైపూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఎడారి ప్రాంతాలైన జోధ్‌పూర్‌లో 12.2 డిగ్రీలు, బికనీర్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రివేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వెచ్చని దుస్తులు ధరిస్తూ, చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.


పగటిపూట భిన్నమైన వాతావరణం.. బార్మర్‌లో అత్యధికం :

ఒకవైపు రాత్రిపూట చలి వణికిస్తుంటే, మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బార్మర్ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది. మంగళవారం అక్కడ గరిష్ఠంగా 32.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ తర్వాతి స్థానాల్లో జైసల్మేర్ (31.6 డిగ్రీలు), పిలానీ (30.2 డిగ్రీలు) ఉన్నాయి.


మరో వారం రోజులు పొడి వాతావరణమే :

రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్ష సూచన లేకపోవడంతో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్