సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టాక్ మార్కెట్‌లో లాభాలు తగ్గడానికి కారణమిదే : నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

1 గంట క్రితం

This is the reason for the decline in stock market gains: Key remarks by Nirmala Sitharaman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 11:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో మార్కెట్లపై ఒత్తిడి.. దేశీయ మదుపర్లే ప్రధాన అండ


ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో లాభాల శాతం తగ్గడానికి అధిక ద్రవ్య లభ్యత, మదుపర్లు తమ వాటాలను సులభంగా విక్రయించే పరిస్థితులు కూడా కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మార్కెట్ల పనితీరు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, కృత్రిమ మేధ (ఎఐ) రంగం ప్రభావం వంటి అంశాలపై ఆమె మాట్లాడారు.


ట్రంప్ సుంకాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగ్గా ఉందని నిర్మలమ్మ తెలిపారు. అయితే, దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రధాన సూచీలు సుమారు 12 శాతం క్షీణించడం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.


ఎఐ కంపెనీల వైపు విదేశీ పెట్టుబడులు ....

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తైవాన్‌, దక్షిణ కొరియాల్లోని కృత్రిమ మేధకు సంబంధించిన కంపెనీల వైపు పెట్టుబడులు మళ్లడం భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ స్థాయిలో మూలధనం తరలిపోవడం ఆందోళనకరమని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎఐ రంగంలో ఏర్పడిన పెట్టుబడుల బుడగ పేలినా భారత్‌కు పెద్దగా నష్టం ఉండకపోవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో భారత్‌ నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. అయితే, అధునాతన సాంకేతికతలో భారత్‌ వెనుకబడలేదని, సెమీకండక్టర్ల తయారీ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయని వివరించారు.


దేశీయ పెట్టుబడులే మార్కెట్‌కు బలం ...

విదేశీ పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ, దేశీయ మదుపర్లు మాత్రం మార్కెట్‌కు అండగా నిలుస్తున్నారు. 2021 మార్చి నుంచి ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలోకి ప్రతి నెలా నికర పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడి పథకాల (ఎస్‌ఐపి) ద్వారా కొనసాగుతున్న నగదు ప్రవాహం మార్కెట్‌లో నిధుల లభ్యతను పెంచుతోంది. దీంతో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తూ మార్కెట్‌ నిలకడగా కొనసాగేందుకు దేశీయ పెట్టుబడులు తోడ్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ... విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇలాగే కొనసాగితే 2027లో భారత మార్కెట్లకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ పెట్టుబడులు మార్కెట్‌కు ప్రస్తుతం అండగా నిలుస్తున్నప్పటికీ, విదేశీ మూలధనం తరలిపోవడాన్ని విస్మరించలేమన్నది ఆమె వ్యాఖ్యల సారాంశం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్