సైటెక్ : ప్రముఖ కృత్రిమ మేధ (ఎఐ) సంస్థ ఆంథ్రోపిక్ తన కంపెనీలోని వాటాలను ప్రజాప్రయోజనాలకు వినియోగించాలన్న నిర్ణయం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. సంస్థలో 5 శాతం వాటాను ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక నిధికి కేటాయించనున్నట్లు ప్రకటించగా.. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ఆ వాటాలను ప్రత్యేక నిధికి ఇవ్వడం కంటే నేరుగా ప్రజలకే పంచితే బాగుంటుందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ‘భవిష్యత్తులో నేను కూడా ఇదే చేయబోతున్నాను’ అని ఎక్స్ వేదికగా ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు. అయితే ఏ కంపెనీ వాటాలను, ఎప్పుడు, ఏ విధంగా ప్రజలకు పంచుతారన్న విషయంపై మస్క్ ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.
ప్రజాప్రయోజనాల కోసం ప్రత్యేక నిధి ....
ఆంథ్రోపిక్ తన సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ నిధికి ‘ఆంథ్రోపిక్ పబ్లిక్ బెనిఫిట్ ఫండ్’ అని పేరు పెట్టింది. తొలుత సంస్థలో 5 శాతం వాటాను ఈ నిధికి కేటాయించనుంది. కంపెనీ విలువ ప్రతి 50 శాతం పెరిగినప్పుడల్లా అదనంగా మరో 2 శాతం వాటాను నిధికి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నిధి ద్వారా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడంతోపాటు ఆర్థికంగా సహాయం అవసరమైన వర్గాలకు అండగా నిలవనున్నారు.
ఎఐ తో మారుతున్న ఉద్యోగ రంగంపైనా దృష్టి ....
కృత్రిమ మేధ విస్తరణతో ఉద్యోగ రంగంలో చోటుచేసుకునే మార్పులు, కార్మికులు ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారంపైనా ఈ నిధి దృష్టి సారించనుంది. ఈ అంశాలపై పరిశోధన కోసం ఇప్పటికే 200 మిలియన్ డాలర్లను కేటాయించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.
20 శాతం వాటాలు ప్రజల ప్రయోజనాలకు ?
ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకులు తమ వాటాల్లో 80 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించారు. సంస్థ ఉద్యోగుల్లోనూ దాదాపు సగం మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. సంస్థ మొత్తం వాటాల్లో దాదాపు 20 శాతం ప్రజాప్రయోజనాలకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నిధులను రాజకీయ విరాళాలు లేదా లాబీయింగ్ కోసం వినియోగించబోమని సంస్థ స్పష్టం చేసింది. ఒకవైపు ఆంథ్రోపిక్ తన వాటాలను ప్రజాప్రయోజనాలకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. మరోవైపు మస్క్ నేరుగా ప్రజలకే వాటాలు పంచుతానంటూ చేసిన వ్యాఖ్యలు టెక్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.








కామెంట్‌లు (0)