లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలపై ఆరా..
పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు
ముంబై : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేశారు. రైలులో ప్రయాణిస్తుండగా రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్ర వాసి. ఈ దాడికి సంబంధించి నిందితులు ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. టైగర్ ష్రాఫ్ దినచర్య, కదలికలపై నిందితులు కొన్ని రోజులపాటు నిఘా పెట్టి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం ఆయన ముంబైలోని జుహు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తారన్న సమాచారాన్ని సేకరించారు. అక్కడి నుంచి ఆయన కారులో తిరిగి వెళ్లే సమయంలో దాడి చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
దాడి అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు కూడా నిందితులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఎస్వీ రోడ్ మీదుగా వైల్ పార్లే, అంధేరి ప్రాంతాల గుండా పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో మోటార్‌సైకిల్‌ను వదిలేసి, అక్కడి నుంచి రైలులో బోరివలీకి వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దు దాటి గుజరాత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించిన నిందితులు చివరకు రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కారు. ఈ హత్యాయత్నం వెనుక అసలు కారణాలేమిటి? నిందితులకు లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో ఎలాంటి సంబంధాలున్నాయి? ఈ కుట్రలో ఇంకా ఎవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








కామెంట్‌లు (0)