మేలో 81 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభం, హర్మూజ్ జలసంధి గుండా రవాణా ఆటంకాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు మండిపోవడంతో భారత ముడి చమురు దిగుమతి భారం భారీగా పెరిగింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పిపిఎసి) తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మేలో దేశ చమురు దిగుమతి బిల్లు ఏకంగా 81.5 శాతం పెరిగి 18.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే.. దిగుమతి పరిమాణంలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. గతేడాది 21.3 మిలియన్ టన్నుల నుంచి ఈసారి 21.6 మిలియన్ టన్నులుగానే ఉన్నప్పటికీ భారం పెరిగింది. ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 64.04 డాలర్ల నుంచి ఏకంగా 106.23 డాలర్లకు చేరడమే ఈ అదనపు భారానికి ప్రధాన కారణం. ప్రస్తుతం భారత్ మొత్తం వస్తు దిగుమతుల బిల్లులో ముడి చమురు వాటానే అత్యధికంగా దాదాపు 20 శాతంగా ఉంది. దేశీయ అవసరాల కోసం ముడి చమురులో 90 శాతం, ఎల్‌ఎన్‌జిలో 50 శాతం, ఎల్‌పిజిలో 60 శాతం మేర అంతర్జాతీయ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. దేశంలో కొరత రాకుండా ఉండేందుకు భారీ వ్యయంతో కేంద్రం ఇటీవల చమురును కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో దిగుమతుల ఖర్చుల నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయాన్ని మినహాయించగా మిగిలిన నికర చమురు, గ్యాస్ బిల్లు 75 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరింది.









కామెంట్‌లు (0)