గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతోటలోన నేను!

1 గంట క్రితం

kavitha (1).
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తోటలోన నేను

తిరుగుచుంటి తాతతో

పండ్ల చెట్లు.. పూల చెట్లు

సంతోషంగా చూస్తూ ఉంటే

​అందాల చిలుక ఒకటి

చెట్టుమీద వాలింది

జామకాయనొకటి కొరికి

జారవిడిచి జారుకుంది!

కోతి ఒకటి చకచక చెట్టునెక్కి

కొబ్బరికాయని తెంపింది టక్కున

ఢామ్మనగానే బాబోయన్నా

బొండం చూపి నవ్వాడు తాత!

ఉడుతమ్మ ఉరుకుతు వచ్చి

బాదం చెట్టును గబగబ ఎక్కి

చటుక్కున కాయను కొరికి

నేలపైకి విసిరింది నిర్లక్ష్యంగా

​కావు కావు కాకి వచ్చి

చింత చెట్టుపై చిందులు వేసి

చింతకాయలు తెంచి

చిందరవందరగ పడేసింది!

‘తాతా! చూశావా వీటి ఆగడం

ఎంత నష్టం .. ఎంత నష్టం!

వీటి అల్లరి ఎంతో చేటు కదా’

కోపంగా అడిగాను నేను

నవ్వుతూ చూశాడు తాత

‘నష్టం కాదు, అంతా లాభమే

ఇవి చేసేది అల్లరి కాదు

విరివిగా విత్తన పరివ్యాప్తి!​

ఈ జీవులే నిరంతరం

విత్తనాలను వెదజల్లి

గింజలెన్నిటినో విసర్జించి

చెట్ల పెంపుకు పాటు పడతాయ్’

అది విని ఆనందంతో నేను

అయితే ఇవి నా నేస్తాలు

నేను కూడా నేటినుంచి

మొక్కలు నాటుతానన్నాను

శభాష్ అంటూ తాత

తవ్వాడు ఓ గుంత

తెచ్చిన మామిడి టెంకను

వెంటనే నాటాను నేను!

- జె.శ్యామల, హైదరాబాద్,

99896 01113.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్