శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుట్టినరోజు బహుమతి

6 రోజుల క్రితం

పుట్టినరోజు బహుమతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆనంద్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ‘తరగతిలో విద్యార్థులు ఎవరైనా సరిగ్గా చదవకపోతే ఆనంద్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి’ అని మాస్టార్లు అనేవారు. ఆ మాటలు విన్న ఆనంద్‌లో ‘తాను తెలివైనవాడినని, మంచివాడినని’ చిన్న గర్వం వచ్చింది. ఆ గర్వంతో ప్రతి చిన్న విషయానికీ స్నేహితులతో గొడవపడేవాడు. ప్రతి వారి లోని లోపాలను ఎత్తిచూపేవాడు. తక్కువ చేసి మాట్లాడేవాడు. ఆనంద్ ప్రవర్తనతో స్నేహితులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. కొంతకాలానికి ఆనంద్‌తో మాట్లాడడం మానేశారు. స్నేహితులు దూరమవడంతో ఆనంద్ మనసు కలత చెందింది. చదువుపై ఏకాగ్రత తగ్గింది. కొన్ని రోజులకు ఆనంద్ పుట్టినరోజు వచ్చింది. స్నేహితులందరినీ పిలిచాడు. ఒక్కరూ రాలేదు. ఆనంద్‌కు చాలా బాధ కలిగింది. అప్పుడే ఆనంద్ మామయ్య వచ్చాడు. పుట్టినరోజు బహుమతిగా ఒక కథల పుస్తకాన్ని ఇచ్చాడు. ఆనంద్ దిగులుగా ఉండడం చూసి ‘కారణం ఏంటి’ అని అడిగాడు. ఆనంద్ విషయమంతా చెప్పాడు. ‘ఆనంద్! నేను నీకు ఇంతవరకు ఇచ్చిన కథల పుస్తకాలన్నీ బాగున్నాయా?’ అని మామయ్య అడిగాడు. ‘కొన్ని కథలు చాలా బాగున్నాయి మామయ్యా. కొన్ని అంతగా నచ్చలేదు’ అన్నాడు ఆనంద్. ‘నీకు నచ్చని ఒకటో, రెండో కథలు బాగాలేవని ఆ పుస్తకాన్నంతా పడవేశావా?’ అని మామయ్య అడిగాడు. ‘లేదు మామయ్యా! ఆ పుస్తకంలో మంచి కథలు కూడా ఉన్నాయి కదా. అందుకే భద్రంగా దాచుకున్నాను’ అన్నాడు ఆనంద్. ‘స్నేహితుల విషయంలో కూడా నువ్వు అదే పాటించాలి. స్నేహితుడిలో ఉన్న ఒక చెడు గుణం నచ్చలేదని తనలోని మంచి గుణాలన్నింటినీ మరిచిపోకూడదు. స్నేహితుల్లోని మంచిని ప్రోత్సహించు, చెడును సరిదిద్దడానికి ప్రయత్నించు. అప్పుడు నీ స్నేహితులు ఎప్పుడూ నీకు దూరం కారు’ అన్నాడు మామయ్య. ‘నా తప్పు అర్థమైంది మామయ్యా. ఇకపై నా స్నేహితుల లోపాలను మాత్రమే చూడను. వారి మంచిని గుర్తించి ప్రోత్సహిస్తాను. చిన్న విషయాలకు గొడవపడను’ అని ఆనంద్ మాటిచ్చాడు. మరుసటి రోజు ఆనంద్ తన స్నేహితుల దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఆనంద్‌లో వచ్చిన మార్పును చూసిన స్నేహితులు ఎంతో సంతోషపడ్డారు.

- ద్వారపురెడ్డి జయరాం నాయుడు,

కైకలూరు, ఏలూరు జిల్లా, 94415 19570.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్