బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చేదోడు వాదోడు

1 రోజు క్రితం

చేదోడు వాదోడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒకరోజు సాయంత్రం లచ్చవ్వ, రుద్రాంశ్ సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చల్లని గాలి వీస్తోంది. చెట్ల కొమ్మలపై పక్షులు కిలకిలరావాలు చేస్తూ గూళ్లకు చేరుకుంటున్నాయి. దారికి ఇరువైపులా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. ‘లచ్చవ్వా! సాయంత్రం వేళ ఇలా నడుస్తుంటే ఎంత బాగుందో కదా!’ అన్నాడు రుద్రాంశ్. ‘అవునురా! పచ్చని పొలాలను చూస్తూ నడుస్తుంటే మనసుకు హాయిగా ఉంటుంది’ అంది లచ్చవ్వ. ఇంతలో పక్కనే ఉన్న పొలంలో తండ్రీకొడుకులు కలిసి పనిచేస్తూ కనిపించారు. తండ్రి రాజయ్య కలుపు తీస్తుంటే, కొడుకు రంగయ్య ఆయనకు సాయం చేస్తున్నాడు. ‘నాన్నా! ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నావు. బాగా అలసిపోయావు. కాసేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో. ఈ పని నేను చూసుకుంటాను’ అన్నాడు రంగయ్య.

కొడుకు ఆప్యాయతకు మురిసిపోయిన రాజయ్య, ‘సరేరా నాయనా! నువ్వు పనిలో సాయం చేస్తానంటే నాకు కావాల్సిందేముంది!’ అంటూ చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు.

వాళ్లిద్దరినీ గమనించిన లచ్చవ్వ, ‘రాజయ్యా! నీ కొడుకు చిన్నతనంలో అల్లరిచిల్లరగా తిరిగినా పెద్దయ్యాక చేదోడు వాదోడుగా ఉన్నాడయ్యా!’ అంది.

ఆ మాటలు విన్న రుద్రాంశ్‌కు సందేహం వచ్చింది. ‘లచ్చవ్వా! చేదోడు వాదోడు అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘ఒరేయ్ రుద్రా! చేదోడు అంటే చేతితో పనిలో సాయం చేయడం. వాదోడు అంటే మాటతో ధైర్యం చెబుతూ కష్టంలో అండగా నిలబడటం. పనిలో సాయం చేస్తూ, కష్టంలో అండగా నిలిచేవారిని చేదోడు వాదోడు అంటారు’ అంది లచ్చవ్వ. ‘అయితే నేనూ మా నాన్నకు పనుల్లో సాయం చేస్తాను. ఆయనకు కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెబుతాను’ అన్నాడు రుద్రాంశ్. ‘భలే చెప్పావురా!’ అంటూ లచ్చవ్వ మురిసిపోయింది.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు,

శృంగవరపుకోట,

94945 24445.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్