- సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలి
- బాధ్యులను కఠినంగా శిక్షించాలి
- ఐద్వా, ఏపీ మహిళా సమాఖ్య, శ్రామిక మహిళా కమిటీ డిమాండ్
తిరుపతి: తిరుపతి పీకే లేఅవుట్‌లోని లక్ష్మీ నివాసంలో గత నెల 28వ తేదీన మహిళ మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, శ్రామిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్ పి. సాయి లక్ష్మి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నదియా, శ్రామిక మహిళా కమిటీ కన్వీనర్ ఆర్. లక్ష్మి మాట్లాడుతూ.. లక్ష్మీ నివాసంలో మహిళ మృతి చెందిన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. మృతురాలిని గుర్తుతెలియని మహిళగా పేర్కొని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆమె వివరాలు తెలుసుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయకుండానే దహన సంస్కారాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. గుర్తుతెలియని మహిళ మృతి చెందినప్పుడు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె కుటుంబ సభ్యులు ఎవరు? అనే వివరాలు తెలుసుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి బంధువుల కోసం వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ, ఈ విధానాలేవీ పాటించకుండా హుటాహుటిన దహన సంస్కారాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అంతేకాకుండా, మహిళ నివాసం ఉన్న ఇంటి యజమానులు, చుట్టుపక్కల నివాసితులను ఇప్పటివరకు సమగ్రంగా విచారించకపోవడం, పంచనామా నిర్వహణకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లేకపోవడం పలు సందేహాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళ మృతి వెనుక ఉన్న వాస్తవాలను నిష్పక్షపాతంగా వెలికితీయాలని, ఆత్మహత్యనా? లేక హత్యనా? అనే అనుమానాలకు తెరదించేలా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిని ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు పి. హేమలత, బుజ్జి, షకీలా, బుజ్జమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)