శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాగితం విలువ

27 అక్టోబర్, 2026

కాగితం విలువ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 05:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అది ఒక ఉన్నత పాఠశాల. తెలుగు మాస్టారు భాస్కర్‌ ఏడో తరగతి విద్యార్థులకు ‘ప్రకృతి – పచ్చదనం’ అనే అంశంపై వ్యాసం రాయమని చెప్పారు. ఒక గంట తర్వాత విద్యార్థులందరూ వ్యాసాలు రాసిన కాగితాలను మాస్టారుకు ఇచ్చారు. బెల్‌ మోగడంతో పిల్లలందరూ బయటకు వెళ్లిపోయారు. మాస్టారు కూడా వెళ్లిపోతూ బెంచీల వైపు చూశారు. బెంచీల చుట్టూ ఉండలుగా చుట్టిన కాగితాలు పడేసి ఉన్నాయి. మాస్టారు వాటన్నింటినీ పోగు చేసి తన బల్ల దగ్గరకు తీసుకెళ్లి, ఒక్కొక్క కాగితాన్ని సరిచేసి పుస్తకంలో భద్రపరిచారు.

విరామం తర్వాత పిల్లలందరూ తరగతి గదికి వచ్చారు. మాస్టారు ఇంకా అక్కడే ఉండటంతో అందరూ నిశ్శబ్దంగా వచ్చి కూర్చున్నారు. అప్పుడు మాస్టారు, “పిల్లలూ! మీకు కాగితం విలువ గురించి ఒక కథ చెబుతాను. మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఒక సేవకుడు నెల మారిందని క్యాలెండర్‌లోని పేజీని చింపి, ఉండ చుట్టి తోటలో పడేశాడు. అది చూసిన గాంధీ ఆ కాగితపు ఉండను తెచ్చి, సాపు చేసి, దానిపై ముఖ్యమైన విషయాలు రాసి దాచిపెట్టారు. సేవకుడిని పిలిచి, ‘ఇకపై క్యాలెండర్‌ పేజీలను చింపి పారేయవద్దు’ అని చెప్పారు.

“అప్పట్లో క్యాలెండర్లను పన్నెండు పేజీలతో ముద్రించేవారు. ప్రతి పేజీ వెనుకవైపు ముద్రణ ఉండేది కాదు. నెల మారినప్పుడల్లా గాంధీ ఆ పేజీలను చింపి దాచేవారు. మీరు వ్యాసం రాయడానికి ఒక్కొక్కరూ కనీసం నాలుగు నుంచి ఐదు పేజీల వరకు చింపి, ఉండలుగా చుట్టి పారేశారు. మీకు కాగితం విలువ తెలియాలనే గాంధీజీ ఏం చేశారో చెప్పాను” అన్నారు మాస్టారు. పిల్లలందరూ తమ తప్పును గ్రహించారు. “కాగితం విలువ తెలిసింది మాస్టారూ! ఇకపై కాగితాలను వృథాగా పారేయం” అని చెప్పారు. అనంతరం మాస్టారు వద్దకు వెళ్లి, సరిచేసి ఉంచిన కాగితాలను తీసుకుని రఫ్‌ నోట్సులుగా ఉపయోగించుకున్నారు.

- యు. విజయశేఖర రెడ్డి,

హైదరాబాద్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్