శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోడిపుంజుకు దసరా

29 అక్టోబర్, 2026

కోడిపుంజుకు దసరా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

లచ్చవ్వ, రామవ్వ ఇద్దరూ ఒకే ఊళ్లో ఉంటారు. లచ్చవ్వ మునిమనవడు జున్నుబాబు. మహానవమి సాయంత్రం లచ్చవ్వ, రామవ్వ వీధి గుమ్మంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. జున్నుబాబు అక్కడే ఆడుకుంటున్నాడు. ఇంతలో రామవ్వ ఇంట్లోంచి ‘కొక్కోరోకో.. కొక్కోరోకో.. ’ అని కోడిపుంజు కూసింది. ‘రామవ్వా! మీ ఇంట్లో కోడిపుంజును పెంచుకుంటున్నారా?’ అని అడిగాడు జున్నుబాబు. ‘అదేం లేదు.. రేపు దసరా కదా! అందుకే కొనుక్కొచ్చాం రా. వాహనాలకు పూజ చేసిన తర్వాత దీన్ని కోస్తాం’ అంది రామవ్వ. ‘కోడిపుంజును ఎందుకు కోస్తారు?’ అమాయకంగా అడిగాడు జున్నుబాబు. ‘వాహన ప్రమాదాలు జరగకూడదని మా పెద్దల కాలం నుంచి ఈ ఆచారం పాటిస్తున్నాం రా!’ అంది రామవ్వ. ‘మరి కోడిపుంజును కోసిన వాళ్లకు ప్రమాదాలు జరగవా?’ అని అడిగాడు జున్నుబాబు. ఆ ప్రశ్నకు రామవ్వ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ‘నాకు చిన్న దెబ్బ తగిలితేనే మా అమ్మ, అవ్వ ఎంతో బాధపడతారు కదా! అలాంటిది కోడిని కోసేస్తే వాళ్లమ్మ బాధపడదా?’ అని రామవ్వ వైపు చూస్తూ అడిగాడు. ‘తరతరాలుగా వస్తున్న అలవాటును మానుకోలేక జీవహింస చేస్తున్నాం. ఈ చిన్నవాడి పాటి కూడా ఆలోచించలేకపోయాను’ అని మనసులో మథన పడింది రామవ్వ. ‘ప్రమాదాలు జరగకూడదంటే జాగ్రత్తగా వాహనం నడపాలి కదా! మన పండగ కోసం ఓ ప్రాణిని చంపడం ఎందుకు?’ అంది లచ్చవ్వ. ‘నువ్వు చెప్పింది నిజమే లచ్చవ్వ’ అని రామవ్వ అంటుండగానే తాడుకు కట్టిన కోడిపుంజు తప్పించుకోవడానికి రెక్కలు కొట్టుకుంటూ అల్లాడింది. దాన్ని చూసిన రామవ్వ మనసు కరిగిపోయింది. వెంటనే దాని కట్లు విప్పి, మేత వేసింది. కోడిపుంజు స్వేచ్ఛగా తిరుగుతూ మేత తినడం చూసి జున్నుబాబు మురిసిపోయాడు. జున్నుబాబు కళ్లల్లో ఆనందం చూసి ‘ఇక దీన్ని చంపను. మా ఇంట్లోనే పెంచుకుంటాను’ అంది రామవ్వ. ‘భలే రామవ్వా! కోడిపుంజు ప్రాణం కాపాడావు. ఇదే నిజమైన దసరా సంతోషం!’ అన్నాడు జున్నుబాబు. మరుసటి ఉదయం ఇంటి పెరట్లో స్వేచ్ఛగా తిరుగుతున్న కోడిపుంజు ‘కొక్కోరోకో… కొక్కోరోకో…’ అని కూసింది. ఆ అరుపులతో ఇల్లంతా సందడిగా మారింది.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు,

ఆంగ్ల ఉపాధ్యాయులు, శృంగవరపుకోట,

94945 24445.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్