పూర్వం చామలాపల్లి అగ్రహారంలో ఎనభైయేళ్ల లచ్చవ్వ తన కొడుకులు, కోడళ్లు, మనవలు, మునిమనవలతో హాయిగా జీవించేది. లచ్చవ్వ అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆమె మాట్లాడితే చాలు, పాతకాలపు సామెతలు, చక్కని జాతీయాలు నిరంతరం ఆమె మాటల్లో దొర్లుతుంటాయి. లచ్చవ్వ చెప్పే కథలంటే మునిమనవలు రుద్రాంశ్, కాత్యాయని, జున్నుబాబు చెవికోసుకుంటారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలంతా లచ్చవ్వ చుట్టూ చేరారు. వారి కబుర్లు, పాటలు వింటూ లచ్చవ్వ మురిసిపోతుండగా, ఆమె స్నేహితురాలు సోములమ్మ అక్కడికి వచ్చింది.
‘లచ్చవ్వా! విన్నావా? మన ఊరి అచ్చిబాబు కొడుక్కి పదో తరగతిలో 599 మార్కులు వచ్చాయట! అప్పలరమణ కూతురికి మెడికల్ సీటు వచ్చిందట. సత్తిబాబు కొడుకు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకం సాధించాడట. వాళ్ల ప్రతిభ గురించి పత్రికల్లో కూడా ఫోటోలు వచ్చాయట!’ అని సోములమ్మ ఎంతో ఆనందంగా చెప్పింది. ‘అవునా! ఎంత సంతోషకరమైన వార్త! వాళ్లందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పెద్దగా సౌకర్యాలేమీ లేకపోయినా పట్టుదలతో విజయాన్ని సాధించిన ఆ పిల్లలు నిజంగా “మట్టిలో మాణిక్యాలే!”’ అంది లచ్చవ్వ మెచ్చుకోలుగా.
‘మట్టిలో మాణిక్యాలు అంటే ఏమిటి, మామ్మగారు?’ అని కుతూహలంగా అడిగాడు జున్నుబాబు.
లచ్చవ్వ వారిని దగ్గరగా తీసుకుని, ‘మట్టిలో మాణిక్యాలు’ అనేది ఒక సామెత. రత్నాలు తొమ్మిది రకాలు. అవి మాణిక్యం, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, వైడూర్యం, గోమేధికం. వీటిలో ముత్యం, పగడం సముద్రంలో దొరుకుతాయి. మిగిలినవన్నీ మట్టిలో కలిసి ఉంటాయి. ఇవన్నీ ఎంతో విలువైనవి. పూర్వం ఒక ఆసామికి మట్టిలో ఎర్రని రాయి మెరుస్తూ కనిపించగా, దాన్ని స్వర్ణకారునికి చూపించాడట. అది ఎంతో విలువైన ‘మాణిక్యం’ అని ఆయన చెప్పాడట. అప్పటి నుంచి అది ‘మట్టిలో మాణిక్యమైంది’. మట్టిలో ఉన్నప్పుడు దాని విలువ ప్రపంచానికి తెలియదు. అది బయటపడినప్పుడే దాని గొప్పతనం వెలుగులోకి వస్తుంది. అలాగే, పేదరికంలో పుట్టినా, పట్టుదలతో కష్టపడి, ప్రతిభతో గొప్ప విజయాలు సాధించినప్పుడే వారు గుర్తించబడతారు. అలాంటి వారిని ‘మట్టిలో మాణిక్యాలు’ అంటారు’ అని చెప్పింది. ఆ మాటలు విన్న పిల్లలు, ‘ఓహో! అయితే మేము కూడా ఎంతో కష్టపడి చదివి “మట్టిలో మాణిక్యాలు” అనిపించుకుంటాం’ అన్నారు ఉత్సాహంగా. వారి మాటలకు లచ్చవ్వ ఆనందంగా నవ్వింది.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
94945 24445.









కామెంట్లు (0)