బిజినెస్ : గత ఐదు రోజులుగా వరుసగా లాభాలను నమోదు చేస్తూ దూసుకెళ్లిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ఐటి రంగ షేర్లలో భారీ అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ ప్రారంభం నుంచే ప్రధాన సూచీలు క్షీణత దిశగా పయనించాయి.
ఉదయం 10:30 గంటల సమయానికి బిఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు 691 పాయింట్లు పడిపోయి 76,719 వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 199 పాయింట్ల నష్టంతో 23,968 స్థాయికి చేరుకుంది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల కీలక మార్క్ కంటే దిగువకు జారిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ ఒక దశలో 786 పాయింట్లు, నిఫ్టీ 210 పాయింట్ల వరకు పడిపోవడం ఆందోళన కలిగించింది. ఈ పతనం ప్రభావంతో మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర తగ్గుదల నమోదైంది.
ఈ క్షీణతకు ప్రధాన కారణంగా ప్రపంచ ఐటి దిగ్గజం అక్సెంచర్ తాజా ప్రకటన నిలిచింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వృద్ధి అంచనాలను 3-5 శాతం నుంచి 3-4 శాతానికి తగ్గిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులు సంప్రదాయ ఐటీ సేవలపై వ్యయాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొనడం భారత ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఈ నేపథ్యంలో అమెరికా వాల్‌స్ట్రీట్‌లో అక్సెంచర్ షేరు గురువారం రాత్రి దాదాపు 18 శాతం క్షీణించింది. దాని ప్రభావం నేడు భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ ఐటీ సూచీ 5.5 శాతం కంటే ఎక్కువ పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా మార్కెట్లు లాభాల బాటలో సాగడంతో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఒక్కరోజే రూ.1,025 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం కూడా మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచింది.
ఈరోజు అత్యధిక నష్టాలను చవిచూసిన వాటిలో ఐటి రంగ సంస్థలే ముందంజలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ దాదాపు 7.8 శాతం నష్టంతో అగ్రస్థానంలో ఉండగా, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు కూడా 5 శాతానికి మించిన నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐటీ రంగంతో పాటు రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
అయితే ప్రతికూల పరిస్థితుల మధ్య ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చాయి. ఐపీసీఏ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లారస్ లాబ్స్ వంటి కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం), జియో ఐపీఓపై ఉన్న అంచనాల నేపథ్యంలో స్వల్ప లాభాలతో ట్రేడైంది. మరోవైపు బ్యాంకింగ్ రంగం కూడా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ మార్కెట్ పతనాన్ని కొంతవరకు నియంత్రించింది.
ఇక రానున్న రోజుల్లో మార్కెట్ ఏ దిశగా పయనిస్తుందన్న అంశంపై పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.









కామెంట్‌లు (0)