ఆశావాది సాహిత్య వారసత్వం చిరస్థాయి
ఘనంగా పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు 83వ జయంతి వేడుకలు – సాహితీ పురస్కారాల ప్రదానం
ప్రజాశక్తి - అనంతపురం : తెలుగు పద్యం, అవధాన సాహిత్యానికి విశిష్ట సేవలందించిన అవధానాచార్య, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు 83వ జయంతి వేడుకలు, ఆశావాది సాహితీ కుటుంబ పురస్కారాల ప్రధానోత్సవం ఆదివారం అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆశావాది సాహితీ కుటుంబం, పెనుకొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీప్రియులు, కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ ఉపన్యాసకులు ఆశావాది శశాంక మౌళి అధ్యక్షత వహించగా, తిరుపతికి చెందిన శతావధాని, కళారత్న అముదాల మురళి సభా సమన్వయం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనప్రియ కవి ఏలూరు యంగన్న, విశిష్ట అతిథిగా వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీత డా. శాంతి నారాయణ, ఆత్మీయ అతిథిగా ప్రముఖ గాయకుడు ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, గౌరవ అతిథిగా హైదరాబాద్‌కు చెందిన శిల్పి, కళారత్న డా. గొల్లపల్లి జయన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంస్కృత ఉపన్యాసకులు డా. ఆశావాది సుధామ వంశి పురస్కార గ్రహీతలను సభకు పరిచయం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఆశావాది సాహితీ కుటుంబ పురస్కారాలు ప్రదానం చేశారు. సాహిత్య పురస్కారాన్ని అన్నమరాజు ప్రభాకర్ రావు (హైదరాబాద్), అవధాన పురస్కారాన్ని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ (హైదరాబాద్), సామాజిక సేవా పురస్కారాన్ని డా. వై.కె. విశ్వనాథ్ మాదిగ (తిరుపతి) అందుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా డా. వై.కె. విశ్వనాథ్ చేతుల మీదుగా 'అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ పీఠం' లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ .... "డా. ఆశావాది ప్రకాశరావు స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత సాహితీవేత్త. తెలుగు పద్యం, అవధానం, భాషా సాహిత్యం ఉన్నంతకాలం ఆశావాది పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన రచనలు నేటి తరానికీ స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం" అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశావాది శిరీష వాణి, ఆశావాది వసంత గౌరి, ఆశావాది నవీన, ఆశావాది శ్రీవల్లితో పాటు ఆశావాది సాహితీ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









కామెంట్‌లు (0)