12 మందికి గాయాలు..పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
బాధితులను పరామర్శించినమున్సిపల్ చైర్మన్ త్రివేంద్రమూర్తి
ప్రజాశక్తి-పెనుకొండ (అనంతపురం) : శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 12 మందిపై పిచ్చికుక్క దాడి చేసి విచక్షణా రహితంగా కొరికింది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో ఓ ఇంటి ముందు ఉన్న మహిళలు, వృద్ధులు, పిల్లలపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పెనుకొండ మున్సిపాల్ చైర్మన్ త్రివేంద్రమూర్తి బాధితులను పరామర్శించి తక్షణ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 100 కిపైగా కుక్కలు ఉన్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలను పట్టుకుని ఇతర ప్రాంతాలను తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ... బాధితులను పరామర్శించామని, భయపడాల్సిన అవసరం లేదని అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సూపరింటెండెంట్ మోహన్ నాయక్ తో మాట్లాడారు. అత్యవసరమైతే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.






కామెంట్‌లు (0)