చెన్నై : తమిళనాడులోని అంబసముద్రం, పెరుందురై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. మిగిలిన నియోజకవర్గాలైన తిరుచ్చి ఈస్ట్, విరాలిమలై, కరూర్‌లకు సంబంధించి దాఖలైన ఎన్నికల పిటిషన్లపై తగిన ఉత్తర్వులు వెలువడే వరకు, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను నిలిపి ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తయ్యేంతవరకు ఉప ఎన్నికలను వాయిదా వేయాలని తిరునల్వేలికి చెందిన న్యాయవాది కె. వెంకటచలపతి అలియాస్ కుట్టీ పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ శుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి.అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం అంబసముద్రం, పెరుందురైల్లో మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. కోర్టు ఎదుట ఉన్న ఐదుగురు ఎన్నికల పిటిషనర్లు సంబంధిత ఎమ్మెల్యేల విజయాన్ని సవాలు చేయడమే కాకుండా, ఆ నియోజకవర్గాల నుండి తమను గానీ లేదా ఇతర అభ్యర్థులను గానీ ఎన్నికైన అభ్యర్థులుగా ప్రకటించాలని దరఖాస్తులు కూడా దాఖలు చేశారని పిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ముందు ఉప ఎన్నికలు నిర్వహించడం అసాధారణ పరిస్థితికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ, తిరుచ్చి ఈస్ట్ సీటుకు రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. విరాలిమలై, కరూర్, అంబసముద్రం, పెరుందరై నియోజకవర్గాల్లో వరుసగా సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, ఈసక్కి సుబయ్య, ఎస్. జయకుమార్‌లు అన్నాడిఎంకె అభ్యర్థులుగా గెలిచినప్పటికీ, పాలక టివికెలో చేరడానికి ముందు స్పీకర్‌కు తమ రాజీనామాలను సమర్పించడంతో ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)